ఈ-కేవైసీ నేడే లాస్ట్... డేట్ గడువు పొడిగిస్తారా?
- నెలాఖరు వరకు మాత్రమే అవకాశం
- ఈ-కేవైసీ కి నెలాఖరు వరకు మాత్రమే అవకాశం
- ఈ-కేవైసీకు స్పందన అంతంతే.
- జిల్లాలో 71.837 శాతం ఈ-కేవైసీ పూర్తి – ఇంకా 28.2 శాతం పెండింగ్..!
- ఈకేవైసీ గడువులోగా పూర్తి చేసుకోవాలి: తాహశిల్దార్ విఠల్.
బోధన్,జులై 30 (విజయక్రాంతి): బోధన్ రేషన్ కార్డుదారుల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ-కేవైసీ(Ration Card e-KYC) ప్రక్రియకు ఆశించిన స్థాయిలో స్పందన లభించడం లేదు. ఈ నెలాఖరు వరకు మాత్రమే అవకాశం ఉండటంతో మిగిలిన లబ్ధిదారులు వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటివరకు సుమారు 71.837 శాతం మంది మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. అధికారుల సమాచారం ప్రకారం, ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. ఆగస్టు నెలలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని కార్డుదారులు నెలా ఖరులోపు సమీప రేషన్ దుకాణం లేదా సంబంధిత కేంద్రాన్ని సంప్రదించి ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ-కేవైసీ చేయించుకోని వారికి రేషన్ బియ్యం నిలిపివేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ నెల 31వ తేదీతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఇంకా ఈ-కేవైసీ చేయించుకోని కుటుంబ సభ్యులు వెంటనే సమీప రేషన్ దుకాణాన్ని సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడు బయోమెట్రిక్ ధ్రువీకరణ చేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయితే కార్డులు అందుకున్న అనంతరం కార్డులో పేర్లు ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. కానీ చాలామంది కొత్త కార్డు వచ్చిన వారు ఈ-కేవైసీ చేయించుకోవడంలో మాత్రం నిర్లక్ష్యం చేశారు. మరికొన్ని కుటుంబాల్లో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఈ-కేవైసీ చేయించుకోగా, మిగిలిన సభ్యులు ఇంకా చేయించుకోలేదు. నిజామాబాద్ జిల్లాలో 83 వేల కొత్త కార్డులు జారీ అయ్యాయి. అయితే ఈ కొత్త కార్డుదారుల్లో గణనీయమైన సంఖ్యలో కుటుంబాలు ఇప్పటికీ ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. ఈకేవైసీ గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాహశిల్దార్ విఠల్ రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా నేటిలోగా గడువులోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని బోధన్ తహసీల్దార్ విఠల్ సూచించారు.రేషన్ కార్డుల ఈకేవైసీకి నేటితో గడువు ముగియనుంది. ముగిసేలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని వారి రేషన్ సరఫరాపై ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని ఆయన తెలిపారు.






