విధుల్లో నిర్లక్ష్యం.. అధికారులు, సిబ్బందికి షోకాజ్ నోటీసులు
మహబూబాబాద్, మే 7 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మిక తనిఖీలో విధుల పట్ల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారనే వార్తల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ రవి రాథోడ్ సంబంధిత ఆసుపత్రిని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆసుపత్రిలో విధులు సక్రమంగా నిర్వహించని స్థానిక వైద్యులు, సంబంధిత సిబ్బందికి ఈ రోజు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయిలో ఉన్నా సహించబోమని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. ఆసుపత్రులలో సమయపాలన, రోగులకు మర్యాదపూర్వక సేవలు, మందుల లభ్యత, పరిశుభ్రత వంటి అంశాలలో ఎటువంటి అలసత్వం ఉండరాదని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని హెచ్చరించారు. విధి నిర్వహణలో అలక్ష్యం చేసిన సిబ్బందిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.






