వైట్‌హౌస్ వద్ద కాల్పులు
అప్రమత్తమైన సెక్యూరిటీ
దుండగుడిపై కాల్పులు.. ఆస్పత్రికి తరలించగా మృతి
వాషింగ్టన్, మే 24: వైట్ హౌస్ శనివారం అర్ధరాత్రి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓ నిందితుడు, సీక్రెట్ సర్వీస్ బలగాల మధ్య దాదాపు 30 రౌండ్లు ఫైరింగ్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో దుండగుడు హతమయ్యాడు. వైట్‌హౌస్ సమీపంలోని భద్రతా చెక్‌పాయింట్ సమీపంలో కాల్పులకు దిగిన అగంతకుడు, సీక్రెట్ అధికారులు ఎదురు కాల్పుల్లో హతమయ్యాడని అమెరికా సీక్రెట్ సర్వీస్ తెలిపింది.
నిందితుడికి మొదట తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని వెల్లడించింది. నిందితుడిని నసీర్ బెస్ట్(21)గా గుర్తిం చినట్లు అధికారులు ప్రకటించారు. కొన్నేళ్లుగా వైట్‌హౌస్ చుట్టూ సంచరిస్తూ.. రెండు సార్లు అరెస్ట్ అయి, ఇప్పుడు ఏకంగా దాడిచేసి, ప్రాణం కోల్పోయాడు. ఈ కాల్పుల స మయంలో వైట్‌హౌస్‌లోనే ట్రంప్ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమీపంలో కాల్పులు జరగడం ఇది మూడోసారి.
శనివారం అర్ధరాత్రి అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలోని 17వ వీధి పెన్సిల్వేని యా అవెన్యూ ప్రాంతంలోని సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్దకు దూసుకొచ్చిన నసీర్ తన బ్యాగ్‌లోని ఆయుధాన్ని తీసుకుని బలగాలపై కాల్పులకు దిగాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆస్పత్రికి తరలించగా మృతిచెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిగాయని తెలిపారు.
ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. కొన్ని సంవత్సరాలుగా నిందితుడు నసీర్ బెస్ట్ వైట్‌హౌస్ సమీపంలోని భద్రతా సర్వీస చెక్‌పాయింట్ల వద్ద అనేకసార్లు అనుమానాస్ప దంగా తిరిగినట్లు సీక్రెట్ అధికారులు తెలిపారు. ఏడాది క్రితం రెండు సార్లు వైట్‌హౌస్ సమీపంలోని నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో పోలీసులు అతడిని 2025లో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో ఆ ప్రాంగణానికి దూరంగా ఉండాలి(ప్రీట్రయల్ స్టే అవే ఆర్డర్)ని కోర్టు అతడికి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అతడు ఆదేశాలు పాటించకపోవడంతో ఆగస్టులో అతనిపై బెంచ్ వారెంట్ జారీ చేసిందని తెలిపారు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.






