పాక్‌లో ఆత్మాహుతి దాడి.. రైలు బోగీలో పేలుడు
24 మంది మృతి, 82 మందికి తీవ్ర గాయాలు
దాడి మేమే చేశాం : బీఎల్‌ఏ ప్రతినిధి జీయాండ్ బలోచ్
ఇస్లామాబాద్, మే 24: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ క్వెట్టాలో సైనికులే లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 24 మంది మృతి చెందగా, 82 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అనుబంధంగా ఉన్న షటిల్ ప్యాసింజర్ రైలుపై ఈ దాడి జరిగింది. ఆదివారం ఉదయం ఆర్మీ జవాన్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న రైలు స్టేషన్ సమీపంలో సిగ్నల్ దాటుతుండగా పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం రైలు బోగీని ఢీకొట్టింది.
మృతుల్లో ఎక్కువమంది సైనికులే అన్నారు. పేలుడు అనంతరం రైలు పట్టాల నుంచి దట్టమైన పొగ అలముకుంది. రైలు పట్టాలపై మంటలంటుకున్నాయి. పలు రైలు బోగీలు బోల్తా పడగా, అక్కడే నిలిచి ఉన్న వాహనాలు పూ ర్తిగా ధ్వంసమయ్యాయి. ఒక బోగీ బోల్తా పడి, రైల్వే క్రాసింగ్‌ను ఢీకొంది. సహాయక సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు.
ప్రజలు, అధికారులు బోగీల నుం చి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. పేలుడు కారణంగా రైలు పట్టా ల సమీపంలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు చోటు చేసుకోవడంతో రైళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది. క్వెట్టా నుంచి పెషావర్ వెళ్లే జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను స్టేషన్‌లో నిలిపివేశారు. ఆ ప్రాంతంలో ప్రజలు గూమిగూడొద్దని పాక్ హోంమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
బలోచ్ లిబరేషన్ ఆర్మీ పనే..
రైల్వే స్టేషన్ సమీపంలో పేలుడు ఘటన తమ పనేనని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఎ) ప్రకటించింది. క్వెట్టా కంటోన్మెంట్ నుంచి పాక్ దళాల సిబ్బందిని తీసుకువెళుతున్న రైలును లక్ష్యంగా చేసుకున్నామని బలోచ్ ఆర్మీ ప్రతినిధి జీయాండ్ బలోచ్ వెల్లడించారు. బలోచ్ ఆర్మీలోని మహిళా షైనాజ్ బలోచ్ ఓ వీడియోలో మాట్లాడారు. పాక్ నేతలు తమ ప్రజలను అణచివేస్తున్నారని అన్నారు. తమ సంస్కృతి, గుర్తింపు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు.
అణచివేతకు గురైన ప్రతీ బలోచ్ బిడ్డ తన మాతృభూమి విముక్తికోసం ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడని పేర్కొన్నారు. కాగా జాఫర్ ఎక్స్‌ప్రెస్‌కు ముప్పు పొంచి ఉందని పాక్ ఇంటలిజెన్స్ వర్గాలు అనేకసార్లు హెచ్చరికలు జారీ చేశాయి. దీనికితోడు బలోచ్ రెబల్స్, తెహ్రీకే తాలిబాన్ సంస్థలు కూడా ఈ రైలును పలుమార్లు లక్ష్యంగా చేసుకొని దాడులకు పూనుకున్నాయి. ఈ రైలులో సైనిక దళాలను క్వెట్టా నుంచి పంజాబ్‌కు తరలిస్తుంటారు.






