కామారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం.. 12 దుకాణాలు దగ్ధం
హైదరాబాద్: కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు వేగంగా వ్యాపించి అక్కడ ఉన్న దుకాణాలను చుట్టుముట్టాయి. వివరాల్లోకి వెళ్తే... శనివారం రాత్రి చిరు వ్యాపారులు తమ దుకాణాలు మూసివేసి వెళ్లిపోయ్యారు. అర్థరాత్రి దుకాణాలకు ఒకసారిగా మంటలు వ్యాపించడంతో భారీ ఎత్తున చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకోని మంటలను అదుపులోకి తెచ్చారు.
షాపుల పక్కనే ఉన్న చెత్తకుప్పకు నిప్పంటుకుని ప్రక్కనే ఉన్న ట్రన్స్ఫార్మర్ నికి మంటలు అంటుకొని ఈ ప్రమాదం సంభవించి ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో కనీసం 12 దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ. 50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. వీటిలో చాలా దుకాణాలు చిన్న వ్యాపారులకు చెందినవే అని పేర్కొన్నారు. అగ్నిమాపక వాహనాలు వచ్చేసరికే దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయని, నష్టం తీవ్రత చూసి స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, సమీపంలోని కెమెరాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ విషాదం అనంతరం దుకాణ యజమానులు సహాయం, నష్టపరిహారం కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






