9 May, 2026 | 2:33 AM

ఆకతాయిలపై షీటీమ్స్ కొరడా!

09-05-2026 12:12 AM

వారంలో 99 ఆపరేషన్లు 32 మంది అరెస్టు, 33 కుటుంబాలకు పరిష్కారం

శేరిలింగంపల్లి, మే 8 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మహిళలను వేధించే ఆకతాయిలపై షీటీమ్స్ ఉక్కు పాదం మోపుతుంది. మే 2 నుంచి 7వ తేదీ వరకు 99 డికాయ్ ఆపరేషన్లు నిర్వహించి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న 32 మందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు మహిళా, శిశు సంక్షేమ విభాగం డీసీపీ కె. సృజన తెలిపారు.

42 పెట్టీ కేసులు నమోదు చేయగా, మిగిలిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. వివిధ మార్గాల్లో మహిళల నుంచి 17 ఫిర్యాదులు అందాయి. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ 3 కేసుల్లో ముగ్గురు బాధితులను, జేజే యాక్ట్ కింద 2 కేసుల్లో నలుగురు బాలురను రక్షించి 10 మంది నిందితులను అరెస్టు చేసింది. కుటుంబ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా విభేదాలతో దూరమైన 33 కుటుంబాలను తిరిగి కలిపారు.

నివారణలో భాగంగా సైబరాబాద్ వ్యాప్తంగా 1685 మందికి అవగాహన కల్పించారు. ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, సైబర్ మోసాలు, బా ల్యవివాహాలు, మానవ అక్రమ రవాణాపై చైతన్యపరిచారు. మహిళా హెల్ప్ లైన్ 181, చైల్ హెల్ప్‌లైన్ 1098, డయల్ 100, సైబర్ నేరాలకు 1930 నంబర్లను విస్తృతంగా ప్రచారం చేశారు. ఎస్సీఎస్సీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా మాదాపూర్ సంయుక్తంగా నిర్వహించిన మహిళా భద్రత సెషన్‌లో 300 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొన్నారు. డీసీపీ సృజన అత్యవసర పరిస్థితుల్లో స్పందించే తీరు, సత్వర ఫిర్యాదు ప్రాముఖ్యతను వివరించారు. వేధింపులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.