18-02-2026 12:22:39 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కామారెడ్డికి పట్టిన శని షబ్బీర్ అలీ అని, ఆయనకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఘాటైన ఆరోపణలు చేశారు. మంగళవారం కామారెడ్డి బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘాటైన విమర్శలతో ఆరోపణలతో ఉద్వేగ భరితంగా మాట్లాడారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల ఇంటిని నిర్మించాడన్నారు.
షబ్బీర్ అలీ టికెట్లు అమ్ముకొని డబ్బులు పోగు చేసుకుంటాడని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన పత్రికల్లో రాయకూడని భాషల్లో తీవ్ర పరుష జాలంలో మాట్లాడారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన షబ్బీర్ అలీ దమ్ముంటే ఈద్గా, దర్గా సాక్షిగా తమ భార్య పిల్లలను తీసుకొని రావాలని, తాను సైతం కుటుంబంతో వస్తానని ఎమ్మెల్యే అన్నారు. కళాశాలపై మాట్లాడిన షబ్బీర్ అలీ ఒక గజం అమ్మినట్లు చూపిస్తే, తాను గుండు, మీసం తీసుకుంటానని సవాల్ విసిరారు.
కామారెడ్డిలో కె ఆర్ రాజిరెడ్డి కుటుంబానికి సంబంధించిన అంగూర్ తోట కబ్జా, ఫంక్షన్ హాల్ కబ్జా, గోడౌన్లకు పాస్ బుక్కులు ఇవ్వకుండా వెనుక భాగాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ రూపొందించి షబ్బీర్ అలీ, గడ్డం చందులు ఓ రైతు కుటుంబం చనిపోయే పరిస్థితి ఉండడంతో కనికరంతో మాస్టర్ ప్లాన్ లో వెంచర్ వారి భూముల నుంచి రోడ్డు వేసుకుంటామంటే అనుమతి ఇచ్చామన్నారు. తమభూమి ఉన్న స్థలాన్ని మార్చి, కబ్జాలు సెటిల్మెంట్లకు కేరాఫ్ గా మారారన్నారు.
కైలాస్ శ్రీనివాస్ చైర్మన్ కోసం, గడ్డం ఇందు ప్రియ వద్ద, మామిండ్ల లక్ష్మి, పిప్పిరి సుష్మాల వద్ద చైర్మన్ ల కోసం డబ్బులు తీసుకున్న చరిత్ర షబ్బీర్ అలీదే అన్నారు. తాను కాంగ్రెస్ లో ఉన్న సమయంలో సైతం తన వద్ద సైతం 18 లక్షలు తీసుకున్న చరిత్ర షబ్బీర్ అలీదేనన్నారు. శివనూర్‌లో ఉన్న భూమి ఎవరిదని, హైదరాబాద్ లో 100 కోట్ల స్కాం చేసిన చరిత్ర షబ్బీర్ అలిది కదా అని ఆరోపించారు. నమ్మిన వారిని మోసం చేయడం షబ్బీర్ అలి కి అలవాటే అన్నారు.
ఈ విషయంపై తాను సీఎం రేవంత్ రెడ్డికి సైతం తెలియ చేయడం జరిగిందన్నారు. ముస్లింలలో సైతం పేదవారికి తాను ఎల్లవేళలా అండగా ఉన్నానని, చేసిన సహాయం చెప్పుకోలేదన్నారు. దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు, దొంగకు దొంగకు తోడై ఆస్తులు అమ్మిన చరిత్ర షబ్బీర్ అలికే దక్కుతుందన్నారు. కామారెడ్డిలో కబ్జా చేసే నువ్వు, మీ తమ్ముడి చరిత్ర ఆధారాలతో సహా తన వద్ద ఉందని అన్నారు.
రామారెడ్డి రోడ్డులో గల కె.ఆర్ రామకృష్ణారెడ్డికి చెందిన స్థలం ఏడు ఎకరాలు ఉంటే ఆరు ఎకరాలు బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు.. ఇందిరా చౌక్ లో విగ్రహం పెట్టడానికి 20 లక్షలు తీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను చెయ్యని తప్పులను ఆరోపిస్తే వీపు సున్నం చేస్తానన్నారు. కౌన్సిలర్లు నరేందర్ రెడ్డి, మోటూరి శ్రీకాంత్, కుంట లక్ష్మారెడ్డి, సుజిత,యడారం ప్రియాంక, భాను ప్రకాష్, రాహుల్, ప్రీతి జైన్, అరవింద్ పాల్గొన్నారు.
నీ బండారం బయటపెడతాం: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి
స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి వైఖరిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్లరాజు, ఐరె నీ సందీప్, చందులు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు.
మున్సిపాలిటీ చేజారిందన్న ఫ్రస్టేషన్లో ఎమ్మెల్యే ఒక సైకోలా ప్రవర్తిస్తున్నారని, ప్రజాప్రతినిధి హోదాను మరచి వీధి రౌడీలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే తీరుపై ధ్వజమెత్తారు.షబ్బీర్ అలీపై ఆరోపణలు చేస్తే సహించబోమన్నారు. సమావేశంలో వార్డు కౌన్సిలర్లు అంజద్, మాజీద్, లడ్డు, సిద్ధిక్, కళ్లెం సత్యం, యూనిస్, వాజీద్, అనంతరెడ్డి, గంప ప్రసాద్, జమీల్, విద్యార్థి నాయకులు సందీప్, చందు, తుడుము ప్రదీప్, పాల్గొన్నారు.