అంధేర్ నగరి.. చౌపట్ పాలన్!
ఏపీ గుప్పిట్లో తెలంగాణ సర్కార్?!
తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణంపై వార్తాకథనానికి.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేరుతో రిజాయిండర్
హతవిధీ..
ఇదేం చోద్యం!
- పరిపాలనాపరమైన పొరపాటా.. లేక ఉన్న పరిస్థితికి నిదర్శనమా?
- పన్నెండేండ్లు అయినా.. పరాయి పాలనలోనే తెలంగాణ
- అధికార యంత్రాంగంలో మార్పురాని వైనం
- సోషల్ మీడియాలో వ్యంగ్యోక్తులు
- అర్ అండ్ బీ చీఫ్ ఇంజినీర్ లేఖ.. గుడ్డిగా ఫార్వర్డ్ చేసిన ఐ అండ్ పీఆర్
పరాయి పాలనలోనే..
ఈ వివాదంలో అత్యంత కీలకమైన ప్రశ్న ఏమిటంటే.. తెలంగాణకు సంబంధించిన ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై అధికారిక స్పందన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎందుకు వచ్చింది? తెలంగాణ ప్రభుత్వ రికార్డుల ప్రకారం జి.రాజేశ్వరరెడ్డి రాష్ట్ర ఆర్ అండ్ బీ (భవనాల) చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కార్యాలయం ఎర్రమంజిల్‌లోని ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయంలో ఉంది.
తెలంగాణ ఆర్ అండ్ బీ వ్యవహారాల్లో ఆయన కీలక పాత్రధారి. అంటే ఆయన తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారి అయినప్పటికీ.. ఈ లేఖకు వాడిన లెటర్‌హెడ్ చూస్తుంటే ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి పరిపాలనా యంత్రాంగం ఉందా అనే అనుమానాలకు తావిస్తోంది. అలా కాకుండా.. పాత టెంప్లేట్‌ను వాడారా, లేక దీని వెనుక మరేదైనా వ్యవస్థీకృత లోపం ఉందా అనే అనుమానాలు బలంగా వినపడుతున్నాయి.
* తెలంగాణలో పరిపాలనాపరమైన స్వయంప్రతిపత్తి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణకు సంబం ధించిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అసలైన నిర్ణయాధికారం ఎవరిదనే విషయాలపై ఈ రిజాయిండర్ అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): పుష్కర కాలమైనా ఇంకా అధికారగణంలో ఎలాంటి మార్పూ కనిపించడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించి పన్నెండేండ్లు గడుస్తున్నా.. ఇంకా ఆంధ్రప్రదేశ్ కనుసన్నల్లోనే తెలంగాణ సర్కారు పనిచేస్తుందా అంటే.. అవుననే విధంగా.. తాజా సంఘటన అద్దం పడుతోంది. తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణం రాజేంద్రనగర్‌లో సుమారు 100 ఎకరాల్లో జరుగుతోంది.
ఈ నిర్మాణ పనుల్లో అవకవతకవలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ, హైదరాబాద్ నుంచి ప్రచురితం అయ్యే ‘మెట్రో ఇండియా’ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన వార్తాకథనానికి రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం నుంచి వచ్చిన వివరణాత్మక ఖండన (రిజాయిండర్) అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
ఏకంగా.. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్ అంటూ వచ్చిన వివరణ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడమే కాదు.. అనేక వ్యంగ్యోక్తులు, హాస్యోక్తులకు వేదికయ్యింది. దీనితో పుష్కర కాలం గడుస్తున్నా తెలంగాణ సర్కారు.. ఇంకా ఆంధ్రప్రదేశ్ గుప్పిట్లోనే ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఇదేం లేఖ..
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో.. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్‌మెంట్ అంటూ రావడం.. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ, పరిపాలనా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నూతన తెలంగాణ హైకోర్టు భవన సముదాయ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఒక పరిశోధనాత్మక కథనానికి స్పందనగా ఆర్ అండ్ బీ శాఖ సీఈ నుంచి జారీచేసిన రిజాయిండర్ (ఖండన), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖ అధికారిక లెటర్‌పై రావడం తీవ్ర చర్చకు దారితీసింది.
హైకోర్టు ప్రాజెక్టు చుట్టూ వివాదాల నీడ (హైకోర్ట్ ప్రాజెక్ట్ అండర్ క్లౌడ్) శీర్షికన మే 14, 2026న ’మెట్రో ఇండియా’ ఆంగ్ల పత్రికలో ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. అయితే ఈ కథనంపై ఆర్ అండ్ బీ శాఖ నుంచి వెలువడిన రిజాయిండర్‌లో పేర్కొన్న అంశాలు.. తెలంగాణలో పరిపాలనాపరమైన స్వయంప్రతిపత్తి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణకు సంబంధించిన కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో అసలైన నిర్ణయాధికారం ఎవరిదనే విషయాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో, అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ. 2,583 కోట్లతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో హైకోర్టు ప్రధాన భవన సముదాయం, న్యాయమూర్తుల నివాసాలు మరియు ఇతర అనుబంధ వసతులు ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై ‘మెట్రో ఇండియాలో’ వచ్చిన కథనంలో పలు అంశాలపై జరిగిన అవకతవకలను సవివరంగా పేర్కొన్నారు.
ముఖ్యంగా, లోతైన తవ్వకాలు జరపడానికి, అదనపు పునాదులు వేయడంతో ప్రాజెక్టు వ్యయాన్ని దాదాపు రూ. 200 కోట్ల మేర పెంచడానికి వీలుగా.. సాయిల్ బేరింగ్ కెపాసిటీ (ఎస్‌బీసీ) నివేదికలను మార్చారనేది ప్రధాన ఆరోపణ. సమీప ప్రాంతాలలో ఈ సామర్థ్యం చదరపు మీటరుకు 115 టన్నులుగా ఉంటే, ఇక్కడ మాత్రం తక్కువగా (40 నుంచి -70 టన్నులు) చూపించారని ఆ కథనంలో పేర్కొన్నారు.
వీటితో పాటు నిర్మాణ నాణ్యత, క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది సంఖ్యకు -కాగితాల్లో చూపిస్తున్న సంఖ్యకు మధ్య ఉన్న వ్యత్యాసాలు, ఆమోదిత డిజైన్ల ఉల్లంఘనలకు సంబంధించిన లోపాలను ఎత్తిచూపుతూ 2025 డిసెంబరులో హైకోర్ట్ బిల్డింగ్ కమిటీకి లేఖ రాసిన కన్సల్టెంట్ ’టీమ్ వన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ను పక్కన పెట్టడం వంటి అంశాలపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా.. మే 17న హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని రోడ్లు, భవనాల శాఖ (భవనాలు) చీఫ్ ఇంజనీర్ జి.రాజేశ్వరరెడ్డి నుంచి వచ్చిన ఒక రిజాయిండర్‌ను తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పీఆర్) కమిషనర్ కార్యాలయం ద్వారా పంపించారు.
అయితే, అత్యంత దిగ్భ్రాంతికరంగా ఆ లేఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ అండ్ బి శాఖ నుంచి వచ్చినట్టుగా స్పష్టంగా ఉంది. అలా వచ్చిన లేఖను ఐ అండ్ పీఆర్ శాఖ కమిషనర్ కార్యాలయం కూడా గుడ్డిగా ఫార్వర్డ్ చేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
దీనిని కేవలం ఒక చిన్న ముద్రణ పొరపాటుగా కొట్టిపారేయలేం. రాష్ట్ర విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు తమదైన ప్రత్యేక పరిపాలనా గుర్తింపును ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో కొన్ని వనరులను, సిబ్బందిని, కొన్నిసార్లు ఆస్తులను కూడా ఉమ్మడిగా పంచుకుంటూనే ఉన్నాయి.
ఆర్ అండ్ బీ వంటి కీలక శాఖలలో ఇటువంటి ధోరణి కొనసాగడం అంటే, తెలంగాణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణ ఇంకా పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాల ప్రభావంలోనో లేదా పర్యవేక్షణలోనో ఉందనడానికి ఇది సంకేతమని విమర్శకులు వాదిస్తున్నారు. చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఇరు ప్రభుత్వాలకు జవాబుదారీతనంతో పనిచేస్తోందా? లేక .. తెలంగాణలోని భారీ ప్రాజెక్టుల పరిశీలన ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిపాలనా ఛానెళ్ల ద్వారానే జరుగుతోందా? అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది.
పారదర్శకత ఆవశ్యకత..
ఈ ఘటన ఇరు రాష్ట్రాల మధ్య పరిపాలనాపరమైన విభజనను అక్షరాలా, ఆచరణాత్మకంగా పూర్తి చేయాల్సిన అత్యవసర స్థితిని గుర్తు చేస్తోంది. కేడర్లు, ఆస్తులు మరియు శాఖాపరమైన నిర్మాణాల స్పష్టమైన విభజన ఎప్పుడో జరగాల్సింది, కానీ ఇప్పటికీ చాలా అంశాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. తెలంగాణ విషయానికొస్తే, బాహ్య శక్తుల నీడలు లేకుండా స్వతంత్రంగా తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సజావుగా అమలు చేయాలంటే, ఆర్ అండ్ బీ మరియు మౌలిక సదుపాయాల విభాగాలపై పూర్తి నియంత్రణను సాధించడం అత్యంత కీలకం.
హైకోర్టు భవన సముదాయం అనేది కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కూడిన కట్టడం మాత్రమే కాదు.. అది ఒక యువ రాష్ట్ర న్యాయ వికేంద్రీకరణకు, న్యాయ వ్యవస్థకు ప్రతిరూపం. ఇందులో జరిగే ఎలాంటి అక్రమాలైనా లేదా బాహ్య శక్తుల జోక్యమైనా సంస్థ విశిష్టతను దెబ్బతీస్తుంది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం నుంచి తక్షణం, పారదర్శకమైన వివరణ రాకపోతే, తెలంగాణ అభివృద్ధి ఎజెండాను నిజంగా నడిపిస్తోంది ఎవరనే దానిపై ఇప్పటికే ప్రజల్లో తలెత్తుతున్న అనుమానాలను నిజమనే చెప్పుకోవాల్సి వస్తుంది.
ఈ ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి కావాల్సి ఉన్నందున, ప్రజల్లో నమ్మకాన్ని పాదుకొల్పడానికి కేవలం రిజాయిండర్లు ఇస్తే సరిపోదు. నిజాయితీగా రాష్ట్ర స్వయంప్రతిపత్తి విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించి చూపించాలి. తెలంగాణ ప్రజలకు అటు నిర్మాణపరంగానూ, ఇటు నైతికంగానూ పటిష్టమైన పునాదులపై నిర్మితమైన హైకోర్టు భవన సముదాయం అవసరం.
ఈ లోపం గనుక ఉద్దేశపూర్వకంగా జరిగి ఉంటే తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇది కేవలం పొరపాటున జరిగి ఉంటే, నూతన హైకోర్టు భవన సముదాయంతో పాటు ఇతర ప్రాజెక్టుల నిర్వహణలో కూడా ఇటువంటి పద్ధతినే అవలంబిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇటువంటి పరిస్థితిలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం.






