19 May, 2026 | 2:09 AM

లారీలు రాక.. ధాన్యం పోక!

19-05-2026 12:48 AM
  1. లారీలు ఏర్పాటు చేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు 
  2. మెదక్ జిల్లా పాపన్నపేట, కొల్చారంలో రాస్తారోకోలు

నల్లగొండ/పాపన్నపేట/కొల్చారం, మే 18: ధాన్యం తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయడం లేదని నిరసిస్తూ మెదక్ జిల్లా పాపన్నపేట, కొల్చారం మండలాల్లో రైతులు నిరసనలు చేపట్టారు. సోమవారం పాపన్నపేట మండల పరిధిలోని మిన్పూర్ రైతులు మెదక్ రహదారిపై బైఠాయించారు.

దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ధాన్యం తరలింపులో వాహనాలు ఏర్పాటు చేయడంలో అధికారులు విఫలం అయ్యారని, వాతావరణం మార్పులతో అకాల వర్షాలు సంభవిస్తే ధాన్యం తడిసిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోతుండగా, వాటిని తరలించేందుకు అవసరమైన లారీలు అందుబాటులో లేక రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజుల తరబడి ధాన్యం తూకం కాకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రాత్రింబవళ్లు అక్కడే కాపలా కాస్తున్నామన్నారు. తూకం పూర్తున ధాన్యాన్ని మిల్లులకు తరలించకపోవడంతో కొత్తగా వచ్చిన ధాన్యానికి స్థలం లేక  కేంద్రాలు కిక్కిరిసిపోయాయని వాపోయారు. లారీలు సరిపడా ఏర్పాటు చేయడంలో అధికారుల వైఫల్యం కారణంగా సమస్య మరింత తీవ్రమైందని రైతులు ఆరోపిస్తున్నారు. హమాలీలు, వాహనాల కొరతగా ఉండటంతో లోడింగ్ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని వాపోయారు.

నిర్వాహకులు నచ్చజేప్పే ప్రయత్నం చేసినప్పటికి రైతులు ససెమిరా అంటూ భీష్మించడంతో విషయం తెలుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని ఎస్‌ఐ శ్రీనివాస్ గౌడ్ రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినకుండా రోడ్డు పై బైటయించడంతో స్థానిక తహసీల్దార్ కు ఎస్‌ఐ ఫోన్‌లో తెలుపడంతో లారీలు కేంద్రానికి సమకూర్చుతానని తెలుపడంతో శాంతించిన రైతులు నిరసనను విరమించారు.

కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ శివారులో 765డి జాతీయ రహదారిపై రైతులు సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలో ఇప్పటికే సుమారు 3,500 వడ్ల సంచులు తూకం వేసి ఐదు రోజులు గడిచినా ఒక్క లారీ కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ విషయమై గ్రామ సర్పంచ్ దయాకర్ గౌడ్ లారీ యూనియన్ ప్రతినిధులను ప్రశ్నించగా, బయట ప్రాంతాల్లో రూ.15 వేల వరకు చెల్లిస్తున్నారని, ఇక్కడ రూ.17 వేల నుంచి రూ.20 వేల వరకు చెల్లిస్తేనే లారీలు పంపిస్తామని చెప్పినట్లు రైతులు ఆరోపించారు. లారీ యూనియన్ అధిక చార్జీలు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య వెంటనే పరిష్కరించకపోతే వందలాది మంది రైతులతో కలిసి మళ్లీ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

విషయం తెలుసుకున్న కొల్చారం ఎస్‌ఐ మహ్మద్ మోహినొద్దీన్ ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి లారీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దయాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, సిద్ధిరాములు, యాదయ్య, మహిపాల్, దినేష్, దుర్గయ్యతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.

నల్లగొండలో బీఆర్‌ఎస్ మహా ధర్నా

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వానికి ముందు చూపు లేదని సీఎం రివ్యూలన్నీ రియల్ ఎస్టేట్‌పైనే ఉన్నాయని బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం నల్లగొండ కలెక్టర్ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు విషయమై రైతు మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి డబ్బు సంచులు ఢిల్లీకి తీసుకెళ్లడమే సరిపోతుందని ఆరోపించారు. ప్రధాని మోదీ పక్కన కూర్చుని రైతుల సమస్యల గురించి కాకుండా రియల్ ఎస్టేట్ గురించి మాత్రమే అడిగాడన్నారు.

దోచుకుని దాచుకొని పారిపోవడమే సీఎం రేవంత్ లక్ష్యమని ఆరోపించారు. సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలే ఇప్పుడు వచ్చాయన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని రైతులు చెప్పులతో కొట్టాలన్నారు. ఈ జిల్లా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. వడ్లలో తరుగు తీస్తాం అంటే ఊరుకోబోమని హెచ్చరించారు. జిల్లాలో మంత్రులు, మిల్లర్లు కుమ్మక్కు అయి రైతులను దోచుకుంటున్నారన్నారు.

ధర్నా అనంతరం అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలె కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, గాదారి కోశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డీ, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, తండు సైదులు గౌడ్ రేగట్టే మల్లికార్జున్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ పాల్గొన్నారు.