19 May, 2026 | 2:34 AM

అంతా దుష్ప్రచారం

19-05-2026 01:18 AM
  1. బండి భగీరథ్ కేసులో బీఆర్‌ఎస్ అతిగా వ్యవహరిస్తున్నది 
  2. కోట్లు ఖర్చుచేసి రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వేసింది
  3. బీఆర్‌ఎస్ పాలనలో అనేక ఘటనలపై బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి 
  4. అప్పుడు మీరు రాజీనామా చేశారా..? 
  5. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): కేంద్రమంత్రి బండి సంజ య్ తప్పు చేయలేదని, బండి సంజ య్ కొడుకు భగీరథ్ తప్పు చేస్తే చట్టం చూసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు పేర్కొన్నారు. అటు బండి సంజయ్‌కిగానీ, ఇటు పార్టీకి గాని ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్‌ఎస్ కోట్లాది రూపా యలు ఖర్చుచేసి రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు వేసి, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి, బీజేపీని బద్నాం చేయాలని చూస్తోందన్నారు.

ముఖ్య ంగా కేటీఆర్ ఈ ప్రచారాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ వంటి పార్టీల వైఖరి వల్ల తెలంగాణ రాజకీయ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని, ముఖ్యంగా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, బీజేపీని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు. ఒక వ్యక్తిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ రాజకీయ లబ్ధిపొందాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వివిధ పార్టీ కార్యక్రమాలపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో రాంచందర్‌రావు కీలక ప్రసంగం చేశారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యల పరిష్కారం కార్యకర్తల పాత్రపై ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్ట ప్రకారం చర్యలు తప్పవని, ఒకవేళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తప్పు చేసి ఉంటే పార్టీ కూడా చర్యలు తీసుకుంటుందన్నారు.

కానీ, ఇక్కడ జరిగింది ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిందని, ఆయన కుటుంబ సభ్యులు తప్పు చేసి ఉంటే చట్టం తన పని చేస్తుందని, కోర్టులు నిర్ణయం తీసుకుంటాయన్నారు. చట్టపరమైన హక్కుల ప్రకారం ఎవరైనా ముందస్తు బెయిల్ తీసుకోవచ్చని, అది పారిపోవడం కాదు.. చట్టంలో ఉన్న హక్కును వినియోగించుకోవడమే అన్నారు. 

బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి..

బీఆర్‌ఎస్ నాయకులు తమ పాలనలో జరిగిన ఘటనలకు ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు, అవినీతి అంశంపై విచారణలు ప్రారంభమయ్యాక కోర్టులను ఆశ్రయించిన వారు, ఇప్పుడు నైతికత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. గత బీఆర్‌ఎస్ పాలనలో మహిళలపై నేరాలు భారీగా జరిగాయని, ఎన్ సీఆర్బీ గణాంకాల ప్రకారం 2014లో తెలంగాణలో మహిళలపై నమోదైన కేసులు 14,147 ఉండగా, 2023 నాటికి అవి 23,679కి చేరాయన్నారు.

అంటే మహిళలపై నేరాలు సుమారు 67 శాతం పెరిగాయని, దీనికి సమాధానం చెప్పాల్సింది బీఆర్‌ఎస్ నాయకత్వమే అని ప్రశ్నించారు. 2022లో జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం ఘటన జరిగిందని, 2019లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సమత అనే 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఇవన్నీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఘటనలేనని, మరి ఈ ఘటనలపై మీ నైతిక బాధ్యత ఎక్కడికి పోయింది అని ఆయన బీఆర్‌ఎస్ నాయకులను నిలదీశారు.

డాక్టర్ ప్రీతి వేధింపుల కేసు అందరికీ తెలిసిందేనని, వేధింపులను తట్టుకోలేక 2023లో వరంగల్‌లో ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. దీనికి మీ ప్రభుత్వం బాధ్యత వహించదా? ముఖ్యమంత్రి బాధ్యత వహించారా? అదేవిధంగా మీ పార్టీకి చెందిన ఓ మహిళా సర్పంచ్ తనపై ఎమ్మెల్యే లైంగిక వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేసింది, మర్చిపోయారా అన్నారు. అలాగే సూర్యాపేట జిల్లాకు చెందిన గిరిజన యువతి లక్ష్మి..

ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కస్టడీలో మృతిచెందిన ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని, పోలీసుల వేధింపుల వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందనే ఆరోపణలు వచ్చాయని గుర్తుచేశారు. ఇవన్నీ మహిళలపై అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరికి ఉదాహరణలని వివరించారు. బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు, నాయకులు కూడా పలు అత్యాచార, మహిళా వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నారని, బీఆర్‌ఎస్ కార్పొరేటర్‌పై అత్యాచార ఆరోపణలు వచ్చాయన్నారు.

బీఆర్‌ఎస్ నాయకులతో సంబంధాలున్న వ్యక్తులు యువతులను డ్రగ్స్ ఇచ్చి కిడ్నాప్ చేసిన కేసుల్లో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారని రాంచందర్‌రావు తెలిపారు. నిర్మల్ మున్సిపాలిటీలో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో కూడా బీఆర్‌ఎస్‌కు సంబంధించిన నాయకుల పేర్లు వినిపించాయని పేర్కొన్నారు.

ఇంతటి దారుణ చరిత్ర బీఆర్‌ఎస్‌పై ఉన్నప్పుడు, ఇప్పుడు మహిళల హక్కులు, మైనర్ల భద్రత గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు ఎక్కడుంది? అని ఆయన ప్రశ్నించారు. ఆ ఘటనల సమయంలో కేసీఆర్ రాజీనామా చేశారా? కేటీఆర్ బాధ్యత తీసుకున్నారా? ఎవరైనా నైతిక బాధ్యత వహించారా? ఇప్పు డు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్న మేనన్నారు. 

లిక్కర్ ఆరోపణలప్పుడు రాజీనామా చేశారా?

కేటీఆర్ కుటుంబ సభ్యులపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం రాజీనామాలు చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీపై అబద్ధపు ప్రచారం చేస్తూ అభాండాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారని తెలిపారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ -రేస్ వంటి అంశాల్లో ఇరుక్కుపోతామని కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్‌ఎస్ నాయకులు, భయంతో బీజేపీపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

దేశ ప్రధానిగా 12 ఏళ్ల పాలన పూర్తి..

ప్రధాని నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలనలో దేశం ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ లక్ష్యాల దిశగా ముందుకు సాగుతోందని, అదే దిశగా పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను వివరించాలన్నారు. దేశ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకోబోతున్నారని, అదే సమయంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై ‘మేరా భారత్ యోగదాన్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.

ఈ మూడు అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని సూచించారు. మేరా భారత్-మేరా యోగదాన్ అంటే దేశానికి ప్రతి పౌరుడు తన వంతు బాధ్యత నిర్వర్తించడమని, ప్రధాని ఇచ్చే ప్రతి పిలుపు దేశ ప్రయోజనాల కోసమే ఉంటుందన్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత పరిస్థితులు నెలకొన్నాయని, అనేక దేశాలు ఇంధన ధరలను భారీగా పెంచేశాయని, కొన్ని దేశాల్లో రేషన్ విధానం కూడా అమలు చేస్తున్నారన్నారు. అయితే భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై అదనపు భారం పడకుండా చూసిందని, అంతర్జాతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇంధన వినియోగంలో క్రమశిక్షణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. 

ఇంధన పొదుపు పాటించాలి..

ఇరాన్--అమెరికా ఉద్రిక్తతలు, రష్యా--ఉక్రెయిన్ యుద్ధం వంటి అంతర్జాతీయ పరిణామాల కారణంగా భవిష్యత్తులో చమురు సంక్షోభం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంధన పొదుపు చేయాలని, కార్పూలింగ్ చేయాలని, ప్రజా రవాణాను వినియోగించాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని,  అవసరమైతే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను కూడా అనుసరించాలన్నారు. తాను కూడా అదే ఆలోచనతో పార్టీ కార్యాలయానికి ఎలక్ట్రిక్ కారులో వచ్చినట్లు తెలిపారు.

ఇది ప్రచారం కోసం కాదని, దేశ ప్రయోజనం కోసం మన జీవన విధానంలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని, ‘ఒక చెటు-అమ్మ పేరు మీద’ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని, ప్రకృతి పరిరక్షణ కోసం స్థానిక ఉత్పత్తులను వినియోగించాలని కోరారు. స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా భావించి ముందుకు సాగాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.