2 April, 2026 | 4:10 AM

మత్తు కోరల్లో షాద్‌నగర్!

02-04-2026 12:28 AM

బెల్టు షాపులను మించిన ‘డ్రగ్’ అడ్డా..

షాద్‌నగర్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): ఒకప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా పేరుగాంచిన షాద్నగర్, ఇప్పుడు ప్రమాదకరమైన మత్తు పదార్థాల హబ్గా మారుతోంది. నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయి, హెరాయిన్ వంటి మత్తు పదార్థాలు పట్టుబడుతున్నా, మాఫియా నెట్వర్క్ మాత్రం చెక్కుచెదరకుండా సాగిపోతుండటం కలకలం రేపుతోంది. చివరకు చాక్లెట్ల రూపంలో మత్తును విక్రయిస్తూ చిన్నారులు, యువత భవిష్యత్తును బుగ్గిపాల్చేస్తున్నారు.

బెల్టు షాపులను మించిన విక్రయ కేంద్రాలు..

గ్రామాల్లో విచ్చలవిడిగా ఉండే మద్యం బెల్టు షాపుల కంటే, ఇప్పుడు మత్తు పదార్థాల విక్రయ కేంద్రాలే అధికంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న పాన్ డబ్బాల నుండి కిరాణా షాపుల వరకు రహస్యంగా ఈ దందా నడుస్తోంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వలస కార్మికుల అవసరా లను ఆసరాగా చేసుకుని, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుండి భారీగా నిషిద్ధ పదార్థాలు ఇక్కడికి చేరుతున్నాయి.

తయారీ కేంద్రంగానూ షాద్‌నగర్..!

షాద్నగర్ కేవలం విక్రయ కేంద్రమే కాదు, డ్రగ్స్ తయారీ కేంద్రంగా కూడా మారుతోందని పోలీసుల దాడులు నిరూపిస్తున్నాయి. గతంలో హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ మరియు ఈగిల్ ఫోర్స్ జరిపిన దాడుల్లో షాద్నగర్లోని ఒక అద్దె గదిలో రసాయనాల ద్వారా ’మెఫెడ్రోన్’ తయారు చేస్తున్న ఇంటర్ స్టేట్ ముఠాను పట్టుకున్నారు.సంజు భాయ్ మార్వాడీ ధాబా వద్ద రాజస్థాన్కు చెందిన వంట మనుషులుగా నటిస్తూ సుమా రు 3 కోట్ల రూపాయల విలువైన హెరాయిన్ను సరఫరా చేస్తూ పట్టుబడటం ఇక్కడి తీవ్రతకు నిదర్శనం.

మాఫియా చేతిలో అధికారులు..?

మత్తు పదార్థాల నియంత్రణలో అధికార యంత్రాంగం వైఫల్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎక్సైజ్ శాఖ తీరు ప్రశ్నార్థకంగా మారింది. జూన్ 2025లో గంజాయి కేసులో స్వయంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ గులాం సుల్తాన్ అహ్మద్ను పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన వారే మాఫియాతో చేతులు కలిపితే, సామాన్యుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమావాస్యకు, పౌర్ణమికి ఒకసారి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, మూలాలను ఏరివేసే ప్రయత్నం జరగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

విక్రయాల్లో కొత్త పోకడలు.. ‘మత్తు’ చాక్లెట్లు....

ముఠాలు ఇప్పుడు తమ పంథాను మార్చాయి. పోలీసుల కళ్లు కప్పి నేరుగా పట్టుబడకుండా ఉండేందుకు మత్తు పదార్థాలను చాక్లెట్ల రూపంలోకి మార్చి అమ్ముతున్నారు. ఇవి పాఠశాలలు, కళాశాలల సమీపంలోని చిన్న షాపుల్లో లభ్యమవుతుండటం తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తోంది.

మేల్కోకుంటే ముప్పే..!

షాద్నగర్ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండటం, స్థానికంగా డిమాండ్ పెరగడం మాఫియాకు వరంగా మారింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, ప్రత్యేక నిఘా విభాగాలను ఏర్పాటు చేయకుంటే షాద్నగర్ ‘డ్రగ్ క్యాపిటల్‘గా మారే ప్రమాదం పొంచి ఉంది. కేవలం చిన్న చేపలను పట్టుకోవడం కాకుండా, ఈ మాఫియా వెనుక ఉన్న తిమింగలాలను వేటాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.