2 April, 2026 | 2:24 AM

వందేళ్ల చరిత్ర.. వందల సవాళ్లు!

02-04-2026 12:25 AM
  1. మసకబారుతున్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠ
  2. పడిపోతున్న విద్యా ప్రమాణాలు
  3. వేధిస్తున్న అధ్యాపకుల కొరత
  4. లక్ష్యాలను చేరుకోవడం లేదంటూ కాగ్ అసంతృప్తి
  5. జాతీయ స్థాయి ర్యాంకులో వెనుకబాటు

హైదరాబాద్, ఏప్రిల్ 1 (విజయక్రాంతి): వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది. విద్యాప్రమాణాలు ఏటా పడిపోతున్నాయని కాగ్ తన నివేదికలో పేర్కొంది. ఉన్నత లక్ష్యాలను చేరుకోవడంలో ఏర్పాటు చేసిన ప్రణా ళికలు అమలు చేయడంలో విఫలమవుతుందని అసంతృప్తి వ్యక్తం చేసింది.

దీంతో జాతీయ స్థాయిలో ఒకప్పుడున్న మంచి ర్యాంకు కాస్త అట్టడుగు స్థాయికి పడిపోయిందని అం దులో పేర్కొంది. ప్రాజెక్టులు, పరిశోధనలు, పాఠ్యాంశాల్లో మార్పులపై వెనుకంజలో ఉన్న ది. ముఖ్యంగా వర్సిటీకు అధ్యాపకుల కొరత తీవ్రంగా వెంటాడుతోందని తెలిపింది. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి మధ్య చాలా వ్యత్యాసం ఉండటంతో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయని తన నివేదికలో కాగ్ పేర్కొంది. 

అకాడమిక్ స్టడీస్‌లోనూ ఫెయిల్

అకాడమిక్ సెనేట్, కళాశాల అభివృద్ధి మండలి (సీడీసీ) సమావేశాలను సరిగా నిర్వహించలేకపోయింది. ఆర్థిక సంఘం ఏర్పాటు లో జాప్యం, మూడు పాఠ్యాంశ విభాగాలకు ఫ్యాకల్టీ ఆఫ్ స్టడీస్‌ను ఏర్పాటు చేయకపోవడం, 36 విభాగాలకు అధ్యయన మండళ్లను పునరుద్ధరణ చేయలేదని కాగ్ తెలిపింది. 43 విద్యా విభాగాలకు సంబంధించిన పాఠ్యాంశాలను సవరించలేదని, నూతన విద్యా విభాగా లను వర్సిటీ ఏర్పాటు చేయలేకపోయింది. పైగా నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు లేని కాలేజీలకు వర్సిటీ కింద పనిచేయడం వంటి వాటిపై తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలపై దృష్టి సారించలే కపోయింది.

మౌలికసదుపాయాలు, విద్యార్థు ల సంఖ్యకు అనుగుణంగా హాస్టల్ భవనాలు కూడా లేవని పేర్కొంది. మంజూరైన పనుల ను కూడా పూర్తి చేయలేకపోయిందని తెలిపింది. పరిశోధనా విద్యార్థులు రీసెర్చ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జాప్యం జరగడం ద్వారా అధ్యాపకులు, విద్యార్థులు పేటెంట్‌లు పొందలేకపోయారు. సకాలంలో ప్రభుత్వ గ్రాంట్లను వర్సిటీ వినియోగించుకోలేకపోయిందని కాగ్ తెలిపింది. 

వర్సిటీలో అధ్యాపకుల కొరత

ఉస్మానియా యూనివర్సిటీని ఎప్పటి నుంచో అధ్యాపకుల కొరత వెంటాడుతోంది. ఇది 2017-18లో 26 శాతంగా ఉండగా.. 2021-22లో 38 శాతానికి చేరింది. 2023 మార్చి నాటికి బోధనేతర సిబ్బంది కొరత 34 శాతం వరకు పెరిగింది. అధ్యాపకుడు-విద్యార్థుల నిష్పత్తి (ఎఫ్‌ఎస్‌ఆర్) 1:15 అమలు కావడంలేదు. ఈ నిష్పత్తి 2018-19, 2020-21, 2021-22లో 1:22 నుంచి 1:33 వరకు ఉంది. దీని ప్రభావం పరిశోధనలపై తీవ్రంగా పడింది.

వెరసి జాతీయ సంస్థాగత ర్యాంకుల్లో 2017లో 38వ స్థానంలో ఉన్న ఉస్మానియా వర్సిటీ ర్యాంకు 2023లో 64వ స్థానానికి పడిపోయింది. మొత్తం వర్సిటీ ర్యాంకుల్లో 2017లో 23వ స్థానంలో ఉన్న ర్యాంకు కాస్త 2023లో 36వ స్థానానికి తగ్గిందని కాగ్ పేర్కొంది. మొత్తం మంజూరైన 1267 పోస్టులకు గానూ 2025 డిసెంబర్ వరకు ఉన్న వివరాల ప్రకారం ప్రొఫెసర్లు 147 మంది, అసోసియేట్ ప్రొఫెసర్లు 53 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 131 మంది పనిచేస్తుండగా, ఖాళీలు 936 ఉన్నాయి. 

మసకబారుతున్న ప్రతిష్ఠ

ఒకప్పుడు విద్యారంగంలో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిష్ఠ ప్రస్తుతం మసకబారుతున్నది. విశ్వవిద్యాలయాల విజయానికి సమర్థవంతమైన ప్రణాళికలే కీలకం. అయితే 2018లో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినప్పటికీ 2023 నాటికి సంస్థాగత లక్ష్యాలను వదిలేస్తూ ఉస్మానియా వర్సిటీ కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయలేకపోయిందని కాగ్ తన నివేదికలో పేర్కొంది.

దీంతో విదేశీ విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. అయితే దీన్నిఅధిగమించడానికి వచ్చే ఐదేళ్లలో విదేశీ విద్యార్థుల శాతాన్ని 30 శాతానికి పెంచాలని విజన్ డాక్యుమెంట్ (దూరదృష్టి పత్రం)లో అనుకున్న ఒక లక్ష్యం కూడా కార్యరూపం దాల్చలేకపోయింది. పైగా ఉస్మానియా వర్సిటీ తన సొంత వనరులను పెంచుకోవడంలోనూ సవాళ్లను ఎదుర్కొంటున్నది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులపైనే ఎక్కువగా ఆధారపడుతుందని కాగ్ పేర్కొంది.