16 May, 2026 | 1:06 AM

సీవరేజ్ ప్రాజెక్టులకు రూ. 3,705 కోట్లు

16-05-2026 12:13 AM

పరిపాలనా అనుమతులు జారీ చేసిన సర్కార్

హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం, మురుగునీటి నిర్వహణ సమస్యల్ని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తూ 101 యూఎల్‌బీల్లో భారీ సీవరేజ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఏకంగా రూ.3705.75 కోట్ల పరిపాలనా అనుమతులకు సర్కార్ ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద సీవరేజ్ ప్రాజెక్టులకు టెండర్లకు అనుమతిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్టులను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) పద్ధతిని ఎంచుకుంది. మొత్తం 101 పట్టణాలను 3 వేర్వేరు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీనివల్ల పెద్ద కంపెనీలు పోటీ పడే అవకాశం లభిస్తుంది.

సాధారణంగా భూసేకరణ పూర్తయ్యాక టెండర్లు పిలవాలి. కానీ ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఎక్కువగా ఉండటంతో.. కొన్నిచోట్ల భూసేకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నా టెండర్లను మాత్రం ఎక్కడా ఆపకుండా తీసుకోవాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణను మరింత వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.

ప్రాజెక్టుల కింద కేవలం డ్రైనేజీ నెట్‌వర్క్, ఎస్టీపీల నిర్మాణం మాత్రమే కాకుండా వాటిని నిర్మించిన సంస్థే ఐదేళ్లపాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ నిర్వహణ బాధ్యతలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ. 3,769.34 కోట్లుగా అంచనా వేయగా, ప్రభుత్వం దీనిని సమీక్షించి, సవరించి రూ.3,705.75 కోట్లకు కుదించి పరిపాలనా అనుమతులు ఇచ్చింది.