అపర సంజీవనికి ‘వేతన’ కష్టం
ఆకలితో అలమటిస్తున్న ఆపద్బాంధవులు!
కనీస అవసరాలు తీరక హరిగోస
రంగారెడ్డి, కందుకూరు, మార్చి 15 (విజయక్రాంతి): ప్రమాదంలో ఉన్న వారిని సకాలంలో ఆసుపత్రికి చేర్చి, ప్రాణాపాయం నుండి కాపాడే ’అపర సంజీవని’ 108 ఉద్యోగుల జీవితాలు నేడు అంధకారంలో ఉన్నాయి. ప్రజల ప్రాణాలను కాపాడే ఈ ఆపద్బాంధవులకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.సాధారణంగా ఒక 108 అంబులెన్స్ యూనిట్కు ఇద్దరు చొప్పున (ఒక EMT - ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మరియు ఒక పైలట్ - డ్రైవర్) సిబ్బంది ఉంటారు.
వీరు షిఫ్టుల వారీగా పనిచేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 నుండి 40 వరకు 108 వాహనాలు సేవలందిస్తున్నాయి. ఇందులో అడ్వానస్డ్ లైఫ్ సపోర్ట్ మరియు బేసిక్ లైఫ్ సపోర్ట్ వాహనాలు ఉంటాయి. ఒక్కో వాహనానికి ముగ్గురు పైలట్లు, ముగ్గురు EMTలు షిఫ్టుల వారీగా కేటాయించబడితే, జిల్లా మొత్తం మీద సుమారు 210 నుండి 240 మంది వరకు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు అంచనా ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వికారాబాద్, మేడ్చల్ జిల్లా వారిగా చుస్తే దాదాపుగా 500 వరకు సిబ్బంది ఉంటారు.
ఆరు నెలలుగా అస్తవ్యస్తం
ఉమ్మడి ఏపీ సీఎం దివంగత వైఎస్సార్ హయాంలో ప్రారంభమై, అత్యవసర వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన 108 సేవలు నేడు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గత ఆరు నెలలుగా జీతాల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల నెలా జీతాలు రాకపోవడంతో వారి కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నాయి.
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబాలు
పగలు, రాత్రి అనే తేడా లేకుండా, ఎండనక వాననక ప్రాణ రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న సిబ్బంది తమ సొంత అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. స్కూల్ ఫీజులు కట్టలేక పిల్లల విద్య ఆగిపోయే పరిస్థితి నెలకొంది.ఇంటి అద్దెలు చెల్లించలేక, బ్యాంకు లోన్ల ఈఎంఐలు సకాలంలో కట్టక జరిమానాల పాలవుతున్నారు. రోజువారీ ఖర్చుల కోసం కూడా ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసన
108 సర్వీసులు అందించే సంస్థకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు సకాలంలో విడుదల కాకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అత్యవసర సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్న పేద, మధ్యతరగతి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఇలాంటి నిర్లక్ష్యం వహించడం తగదని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.
మేము ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నాం, కానీ మా జీవితాలు మాత్రం రోడ్డున పడుతున్నాయి. జీతాలు సకాలంలో వస్తే మరింత ఉత్సాహంగా సేవ చేస్తాం అని ఓ 108 ఉద్యోగి తన ఆవేదనను వెళ్లిబుచ్చారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలి.ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు పడేలా శాశ్వత పరిష్కారం చూపాలి. అంబులెన్సుల నిర్వహణకు అవసరమైన నిధులను ముందే కేటాయించాలి. తమ మొర ఆలకించి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విధులకు ఆటంకం కలిగే ప్రమాదం ఉందని సిబ్బంది హెచ్చరిస్తున్నారు.




