గ్యాస్ మంట.. హోటళ్లకు తంటా!
- రోజుకు 100 కోట్ల నష్టం
హైదరాబాద్‌లో కుదేలవుతున్న హోటల్ రంగం
70 వేల రెస్టారెంట్లకు గ్యాస్ కష్టాలు
మెనూలో భారీగా కోతలు
పరిమిత పదార్థాలు మాత్రమే తయారీ
రోడ్డు పక్కన బండ్లు, టిఫిన్ సెంటర్లు మూత
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 15 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో గ్యాస్ సంక్షో భం పెను విపత్తుగా మారుతోంది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో నగరంలోని హో టల్, రెస్టారెంట్ పరిశ్రమ కుదేలవుతోంది. గ్యాస్ దొరక్కపోవడంతో కార్యకలాపాలు స్తంభించి, ఈ రంగం రోజుకు రూ.100 కోట్లకు పైగా ఆర్థిక నష్టాలను చవిచూస్తోందని పరిశ్రమ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మహానగర వ్యాప్తంగా ఉన్న సుమారు 70 వేల హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ లేక వంట పొయ్యిలను వెలిగించలేక సతమతమవుతున్నాయి. గత రెండు రోజుల్లోనే సుమారు రూ.50 కోట్ల మేర వ్యాపారం తుడిచిపెట్టుకుపోయిందని నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆవేదన వ్యక్తం చేసింది.
మెనూలో కోత.. ధరల్లో మోత
గ్యాస్ కొరత ప్రభావం నేరుగా కస్టమర్ల ప్లేటుపై పడుతోంది. సిలిండర్లను ఆదా చేసేందుకు చాలా రెస్టారెంట్లు తమ మెనూ ను సగానికి పైగా తగ్గించేశాయి. తక్కువ గ్యాస్ వినియోగించే లేదా వేగంగా తయారయ్యే పరిమిత ఐటమ్స్ మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. దోశ, పూరీ వం టి టిఫిన్లకు ఎక్కువ సమయం గ్యాస్ వాడా ల్సి వస్తోంది, అందుకే వాటిని కొన్ని చోట్ల నిలిపివేశాం అని ఓ నిర్వాహకుడు తెలిపారు. మరోవైపు, బ్లాక్ మార్కెట్లో గ్యాస్ ధరలు విపరీతంగా పెరగడంతో, అదనపు భారాన్ని తగ్గించుకోవడానికి హోటళ్లు భోజనం, టిఫి న్ రేట్లను అమాంతం పెంచేశాయి. సామా న్య మధ్యతరగతి ప్రజలకు ఇది గొడ్డలి పెట్టుగా మారింది.
కట్టెల పొయ్యిలు సాధ్యమేనా?
గ్యాస్ కొరతకు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను వాడాలని అధికారులు, ప్రభుత్వం సూచిస్తుండటంపై హోటల్ యజమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. హైటెక్ సిటీ, బంజారాహిల్స్ వంటి రద్దీ ప్రాంతాల్లోని మల్టీ-స్టోరీ బిల్డింగుల్లో కట్టెల పొయ్యిలు ఎలా పెడతాం పొగ, అగ్నిప్రమాదాల ముప్పు ఉండదా..ఇది ఏమాత్రం ఆచరణాత్మక పరిష్కారం కాదు అని వారు తేల్చిచెప్పారు.
చిరు వ్యాపారుల అరిగోస
పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఎలాగోలా నెట్టుకొస్తున్నా, రోడ్డు పక్కన ఉండే చిరు వ్యాపా రులు, తోపుడు బండ్ల మీద టిఫిన్లు అమ్ముకునే వారి పరిస్థితి దారుణంగా ఉంది. ఎల్పీజీ కొరతతో నగరంలోని వేలాది టిఫిన్ సెంటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. రోజువారీ ఆదాయంపై ఆధారపడే వీరి కుటుం బాలు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి ఎల్పీజీ సరఫరాలో కనీసం 50 శాతం కోటాను హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు కేటాయించాలని, లేనిపక్షంలో ఈ రంగం పూర్తిగా కుప్పకూలిపోతుందని యజమానులు హెచ్చరిస్తున్నారు.




