17 July, 2026 | 8:26 PM

యథేచ్ఛగా చెట్ల నరికివేత.. పర్యావరణానికి ముప్పు

17-07-2026 08:18 PM

భారీ వృక్షాల‌ను న‌రుకుతున్నా.. చ‌ర్య‌లు శూన్యం

అధికారుల తీరుతో ప్ర‌జ‌ల్లో ప‌లు అనుమానాలు

ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు త‌ప్ప‌దంటూ ఆందోళ‌న‌

ఉన్న‌తాధికారులు దృష్టి సారించాలంటున్న స్థానికులు

మేడిప‌ల్లి,(విజ‌యక్రాంతి): అభివృద్ధి పనుల పేరుతో చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రోడ్ల విస్తరణ, భ‌వ‌న‌ నిర్మాణాలు, వాణిజ్య ప్రాజెక్టుల కోసం పెద్ద సంఖ్యలో చెట్లను తొలగిస్తున్నారు. దీంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెట్లు తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరగడం, గాలి నాణ్యత క్షీణించడం, పక్షులు, ఇతర జీవుల సహజ ఆవాసాలు నశించడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.

వర్షాలు లేక‌పోవ‌డం వంటివి చెట్ల నరికివేత‌పై ప్రభావం పడే అవకాశం ఉందని ఓవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్ర‌స్తుతం ఎల్‌నినో ప్ర‌భావం కూడా చెట్ల న‌రికివేత కార‌ణ‌మ‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం కోట్ల రూపాయ‌లు వెచ్చిస్తోంది. ఇందుకోసం మొక్క‌ల పెంప‌కం, వ‌న‌సంర‌క్ష‌ణ వంటి కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతూ ప్ర‌తి ఏటా వ‌న మ‌హోత్స‌వం నిర్వ‌హిస్తోంది. భ‌విష్య‌త్ త‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ప్ర‌తి ఒక్క‌రూ మొక్క‌లు నాటాలంటూ ప్ర‌చారాలు చేప‌డుతోంది. ఇదంతా ఒక‌వైపు కాగా మ‌రోవైపు ప‌చ్చ‌ని చెట్ల‌ను న‌రికివేస్తూ కొంద‌రూ ప‌ర్యావ‌ర‌ణాన్ని నాశ‌నం చేస్తున్నారు.

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో సంబంధిత అట‌వీశాఖ నుంచి అనుమ‌తులు తీసుకోవాల‌నే నిబంధ‌న‌లు తుంగ‌లో తొక్కుతున్నారు. అనుమ‌తులు లేకుండా భారీ వృక్షాల‌ను కూక‌టి వేళ్ల‌తో పెకిలించి తీసి అవ‌త‌ల ప‌డేస్తున్నారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా అట‌వీశాఖ అధికారులు నిమ్మ‌కు నీరెత్తిన‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చెట్ల‌ను న‌రుకుతున్నార‌ని ఫిర్యాదు చేసినా చూసీచూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. మ‌ల్కాజిగిరి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ బోడుప్ప‌ల్ స‌ర్కిల్‌-10 మేడిప‌ల్లి డివిజ‌న్ ప‌రిధిలోని సాయిప్రియ న‌గ‌ర్ కాల‌నీ రోడ్డు నెంబ‌ర్ 6లో ఓ భారీ వృక్షాన్ని ఇంటి నిర్మాణం కోసం ఓ బిల్డ‌ర్‌ కూక‌టి వేళ్ల‌తో స‌హా పెకిలించి అవ‌త‌ల ప‌డేశాడు.

దీనిని గ‌మ‌నించిన స్థానికులు సంబంధిత అట‌వీశాఖ అధికారుల‌ దృష్టికి తీసుకెళ్లారు.. అయినా అధికారులు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోకుండా బిల్డ‌ర్‌కే సహకరిస్తున్నారాని, అట‌వీశాఖ అధికారుల తీరుప‌ట్ల‌ ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.  ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా చెట్లను నరికేవారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, పచ్చదనం పెంపు కోసం విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచిస్తున్నారు. అవసరమైతే మాత్రమే చెట్లను తొలగించాలని, నరికిన ప్రతి చెట్టుకు బదులుగా కనీసం ఐదు నుంచి పది మొక్కలు నాటి వ‌న‌ సంరక్షణ బాధ్యతను సంబంధిత శాఖలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్‌పై ప‌లు అనుమానాలు 

ఈ విష‌య‌మై ఫారెస్టు రేంజ్ ఆఫీస‌ర్ కు వివ‌ర‌ణ కోరేందుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయ‌న‌ ఫోన్ ఎత్త‌క‌పోవడం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. చెట్ల‌ను న‌రికిన వారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోగా బిల్డ‌ర్‌కే వ‌త్తాసుప‌లుకుతుండ‌డంతో ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇప్ప‌టికైనా ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు కోరుతున్నారు.