17 July, 2026 | 8:30 PM

నీట్‌లో జైనూర్ విద్యార్థిని ప్రతిభ

17-07-2026 08:23 PM

451 మార్కులతో సత్తా చాటిన సుమయ్య ఫాతిమా

జైనూర్,(విజయక్రాంతి): కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని సుమయ్య ఫాతిమా నీట్–2026 పరీక్షలో 451 మార్కులు సాధించి ప్రతిభ చాటింది. మారుమూల ప్రాంతమైన జైనూర్ నుంచి అత్యుత్తమ మార్కులు సాధించడం విశేషంగా నిలిచింది. సుమయ్య ఫాతిమా ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు జైనూర్‌లోని కేరళ గ్రామర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేసింది. అనంతరం పదో తరగతిని ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పూర్తి చేసి, ఇంటర్మీడియట్‌ను చైతన్య జూనియర్ కళాశాలలో అభ్యసించింది.

ఇటీవల నిర్వహించిన నీట్–2026 పరీక్షలో మంచి ర్యాంకు సాధించే అవకాశాలు ఉన్నప్పటికీ, ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసింది. అనంతరం జూన్ 21న నిర్వహించిన రీ-నీట్ పరీక్షకు హాజరైన సుమయ్య ఫాతిమా, గురువారం రాత్రి విడుదలైన ఫలితాల్లో 451 మార్కులు సాధించి తన ప్రతిభను మరోసారి నిరూపించింది.జైనూర్ వంటి వెనుకబడిన మండలం నుంచి ఈ స్థాయి మార్కులు సాధించిన సుమయ్య ఫాతిమాను స్థానికులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అభినందిస్తూ ఆమె ఉన్నత చదువుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.