భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలో భూగర్భ జలాల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇందిరమ్మ ఇండ్లు, భూగర్భ జలాల సంరక్షణ చర్యలు, తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు.
మండలాల వారిగా ఆయా దశల్లో ఉన్న ఇండ్ల నిర్మాణాలు, లబ్ధిదారులకు అందించిన ఆర్థిక సహాయం, తదితర వివరాలను అధికారులను అడిగారు. ఇండ్ల నిర్మాణ పురోగతిపై సమీక్షించాలన్నారు. భూగర్భ జలాల పెంపులో భాగంగా ఫాం పాండ్స్, తదితర రైన్ వాటర్ రిచార్జింగ్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. వర్షపు నీటిని సంరక్షించి, భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రైన్ వాటర్ రిచార్జింగ్ నిర్మాణాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పిడి శ్రీనివాస్ రెడ్డి, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిపిఓ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.






