15 March, 2026 | 3:06 AM

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో డ్రగ్స్ కాల్పుల కలకలం

15-03-2026 01:48 AM
  1. మొయినాబాద్‌లో ఈగల్ టీమ్ మెరుపు దాడి
  2. పోలీసులపై నిందితుల కాల్పులు
  3. కొకైన్, రివాల్వర్ స్వాధీనం
  4. ఏపీకి చెందిన ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, జైపూర్ ఎమ్మెల్యే ఉన్నట్లు పోలీసుల అనుమానం
  5. పైలట్ రోహిత్ రెడ్డి సహా 8 మంది అరెస్ట్

హైదరాబాద్, సిటీబ్యూరో మార్చి 14 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఫాం హౌస్ శనివారం అర్ధరాత్రి.. అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తులు డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్నారన్న పక్కా సమాచారంతో ఈగల్ టీమ్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో కొకైన్‌తో పాటు మారణాయుధాలు బయటపడటం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

సోదాలకు వెళ్లిన పోలీసులపై నిందితులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది, దీనికి ప్రతిగా పోలీసులు కూడా అప్రమత్తమై గాల్లోకి మూడు రౌండ్లు కాల్పు లు జరిపారు. ఈ హైప్రొఫైల్ డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్‌రెడ్డితో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకు చెందిన టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్, రాజస్థాన్‌లోని జైపూర్ నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు సమాచారం అందుతుండటంతో ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

పోలీసులపైకే గురిపెట్టిన వీఐపీలు..

మొయినాబాద్ పరిసరాల్లోని ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతు న్నాయన్న నిఘావర్గాల హెచ్చరికలతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. శనివారం రాత్రి పైలట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో పార్టీ జరుగుతుండగా ఈగల్ టీమ్ మెరుపుదాడి చేసింది. అయితే, పోలీసులు లోపలికి ప్రవేశించే క్రమంలో అక్కడున్న వ్యక్తులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసులనే భయపెట్టేలా రివాల్వర్ తో ఫైర్ ఓపెన్ చేయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. నిందితులు తప్పించుకోకుండా ఉండేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కొకైన్ మత్తులో పట్టుబడ్డ పెద్దలు..

సోదాల సమయంలో పోలీసులు 2 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ పార్టీ చేసుకుంటున్న వారు డ్రగ్స్ తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు, పైలట్ రోహిత్‌రెడ్డి సహా మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పారిశ్రామికవేత్తలు, రాజకీ య నేతలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించా రు. పార్టీలో ఉపయోగించిన రివాల్వర్, బుల్లె ట్లు సెల్‌ఫోన్లను అధికారులు సీజ్ చేశారు.

ఏపీ ఎంపీ, జైపూర్ ఎమ్మెల్యే ప్రమేయం..

ఈ కేసులో వినిపిస్తున్న పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ, రాజస్థాన్‌కు చెందిన జైపూర్ ఎమ్మెల్యే ఈ పార్టీకి హాజరయ్యారని, పోలీసులు వచ్చే సమయంలో వారు అక్కడే ఉన్నారని సమాచారం. వీరు కూడా కొకైన్ సేవించారా లేదా అన్న కోణంలో పోలీసు లు దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టయిన వీఐపీలందరినీ అత్యంత రహస్యంగా వేరే ప్రాంతా నికి తరలించి విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

రిమాండ్‌కు తరలింపు.. డ్రగ్ టెస్టులు..

మాజీ ఎమ్మెల్యే ఫాంహౌస్‌లో ఏకంగా రివాల్వర్ వాడటం, కొకైన్ దొరకడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా ఉన్నారు. అరెస్ట యిన వారందరికీ డ్రగ్ అనలైజర్ కిట్లతో పాటు రక్త పరీక్షలు నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి పాజిటివ్, ఏలూరి ఎంపీ మహేశ్‌కుమార్‌కు నెగెటివ్‌గా తెలింది. ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని పోలీస్‌వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఘటనపై ఆదివారం ఉదయం సైబరాబాద్ సీపీ పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఫాంహౌస్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు.