ఐకియామీనాక్షిలో నిర్మాణ వ్యర్థాల ప్రక్షాళన
ఈవేస్ట్ సేకరణపై ప్రత్యేక దృష్టి
రంగారెడ్డి కలెక్టర్, అధికారులతో కలిసి సీఎంసీ కమిషనర్ తనిఖీ
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 14 (విజయక్రాంతి): ఐటీ కారిడార్ ప్రాంతంలో రోడ్ల శుభ్రత, పర్యావరణ పరిరక్షణపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారు లు గచ్చిబౌలి పరిధిలోని ఐకియా మీనాక్షి డిలైట్ రోడ్డు మార్గంలో పేరుకుపోయిన నిర్మాణ వ్యర్థాలపై సీఎంసీ కమిషనర్ జి. సృజన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
శనివారం క్షేత్రస్థాయిలో పర్యటించిన ఆమె, రోడ్డు వెంట గుట్టలుగా పడి ఉన్న వ్యర్థాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇతర శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆమె ఈ ప్రక్షాళన పనులను పర్యవేక్షించారు. గచ్చిబౌలిలో వేగంగా జరుగుతున్న నిర్మాణాల కారణంగా రోడ్ల వెంట వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన కమిషనర్.. రంగారెడ్డి కలెక్టర్, కూకట్‌పల్లి జోనల్ కమిషనర్, ఆర్డీఓ, మైనింగ్ శాఖ అధికారులతో కలిసి సంయుక్త తనిఖీ నిర్వహించారు.
రోడ్డు పక్కన ఉన్న రెండు భారీ డెబ్రిస్ గుట్టలను వెంటనే తరలించి, వాటిని రాంకీ సీ అండ్ డీ వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లో శాస్త్రీయంగా శుద్ధి చేయాలని సూ చించారు. వ్యర్థాలను తొలగించిన తర్వాత ఆ ఖాళీ స్థలాలను ప్రజా సౌకర్యార్థం ఎలా వినియోగించుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం ఎన్‌ఏసీ లోని ఈ వేస్ట్ సేకరణ కేంద్రాన్ని కమిషనర్ సందర్శించారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులున్నారు.




