15 March, 2026 | 4:42 AM

పది పరీక్షల్లో సెల్ఫ్ సెంటర్

15-03-2026 01:47 AM

కూకట్‌పల్లి న్యూ ఎరా స్కూల్ విద్యార్థులు 80 మందికి సొంత బడిలోనే కేంద్రం

హాల్ టికెట్లు దాచాలని యాజమాన్యం హుకుం!

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 14 (విజయక్రాంతి): తెలంగాణలో శనివారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. పరీక్షల్లో మాస్ కాపీయింగ్, అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం సెల్ఫ్ సెంటర్‌లో పరీక్ష రాసే విధానాన్ని ఎప్పుడో రద్దు చేసినప్పటికీ కూకట్‌పల్లిలోని న్యూ ఎరా హైస్కూల్ విషయంలో అధికారులు నిబంధనలను పాటించలేదు. ఆ పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే పాఠశాలను పరీక్షా కేంద్రంగా కేటాయించారు.

విషయం బయటకు పొక్కకుండా యాజమాన్యం విద్యార్థు లకు వారి హాల్ టికెట్లను ఎవరికీ చూపించవద్దుని, సెంటర్ పేరు అడిగితే చెప్పవద్దని ముందే హుకూం జారీ చేసినట్లు సమాచారం. పరీక్షల మొదటి రోజే ఈ విషయం వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. పది రోజుల ముందే హాల్ టికెట్లు జారీ అయినా, జిల్లా విద్యాశాఖ అధికారి ఈ అక్రమ కేటాయింపును గుట్టుగా ఉంచడం వెనుక భారీ స్థాయిలో చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ స్కూల్ విద్యార్థులకు అధిక మార్కులు తెచ్చుకునేలా అధికారులే అడ్డదారి చూపించారని స్థానికులు మండిపడుతున్నారు. 

ప్రభుత్వ ఆధీనంలో బడి: ఎంఈవో..

మండల విద్యాధికారి రవీందర్ దీనిపై వివరణ ఇచ్చారు. న్యూ ఎరా పాఠశాలలో నెలకొన్న కొన్ని ప్రత్యేక సాంకేతిక కారణాల దృష్ట్యా, ప్రభుత్వం ఆ పాఠశాలను తాత్కాలికంగా తన అధీనంలోకి తీసుకుందని పేర్కొన్నారు. ఆ ప్రాంగణాన్ని ప్రస్తుతం రెడ్ జోన్‌గా ప్రకటించామని, కేవలం పరీక్షల నిర్వహణ కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ఇది ప్రైవేట్ యాజమాన్యానికి లాభం చేకూర్చే చర్య కాదని, పారదర్శకత కోసమే ఇలా చేశామని చెపుతున్నారు. విమర్శల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యాశాఖతో పాటు రెవెన్యూ అధికారులను కూడా పర్యవేక్షణకు నియమించారు. అదనపు ఇన్విజిలేటర్లను రంగంలోకి దించడమే కాకుండా, సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్ష నిఘా ఏర్పాటు చేశారు.