21 May, 2026 | 5:56 PM

వేసవి శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

21-05-2026 05:00 PM

నిర్మల్,(విజయక్రాంతి): వేసవి శిక్షణా శిబిరాలను విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. మామడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవి) లో కొనసాగుతున్న వేసవి శిక్షణా శిబిరాన్ని (సమ్మర్ క్యాంప్) జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంప్‌లో విద్యార్థినులకు నేర్పిస్తున్న వివిధ రకాల నైపుణ్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమ్మర్ క్యాంప్ ల ద్వారా విద్యార్థులకు డాన్స్, పాటలు, యోగా, పెయింటింగ్, ఆటలు, కళలు తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారని, విద్యార్థులు ఈ అవకాశం ఉపయోగించుకోవాలని అన్నారు. 

విద్యార్థులకు కలెక్టర్ స్వయంగా ప్రయోగాత్మకంగా పాఠాలు బోధించారు. కేవలం పుస్తకాల్లోని చదువే కాకుండా, నిత్య జీవితంలో విషయాలను ఎలా అర్థం చేసుకోవాలో ఉదాహరణలతో వివరించారు. అనంతరం విద్యార్థినులకు కొన్ని ప్రశ్నలు వేసి, వారి విద్యా సామర్థ్యాలు, నైపుణ్యాలను పరీక్షించారు. బాలికలు ఉత్సాహంగా సమాధానాలు చెప్పడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు. వేసవి సెలవులను వృథా చేయకుండా, ఇలాంటి శిక్షణా శిబిరాల ద్వారా కొత్త విషయాలను నేర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.