28 July, 2026 | 2:23 AM

ఇంకుడు గుంతల నిర్మాణాల్లో స్వయం సహాయక సంఘాలు భాగస్వామ్యం కావాలి

28-07-2026 01:46 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 27 (విజయక్రాంతి): జిల్లాలో భూగర్భ జలాల పెంపు, ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఇంకుడు గుంతలు, ఫారం పాండ్లు, సామాజిక ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ఈ పనుల్లో స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు.

సోమవారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్ రైతు వేదికలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారాంతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి వర్షపు నీటి బొట్టును భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయలు, పప్పుధాన్యాల సాగు వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించారు.

ఆగస్టు 15 నాటికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫాంలు అందజేయాలని, నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తనమేళాను కలెక్టర్ సందర్శించి విత్తన ప్యాకెట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్, మండల వ్యవసాయ అధికారి మిలింద్, సెర్ప్ ఏపీఎంలు, సీసీలు తదితరులు పాల్గొన్నారు.