11 March, 2026 | 11:18 PM

విద్యార్థుల చైతన్యానికే స్వయం పరిపాలన

11-03-2026 09:07 PM

● సౌమ్య విద్యామందిర్‌లో ఉల్లాసంగా స్వపరిపాలన దినోత్సవం

చిట్యాల,(విజయక్రాంతి): విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించడమే లక్ష్యంగా స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల వ్యవకర్త బొడిగె రవీందర్, ప్రిన్సిపల్ బొడిగె విజయ్ కుమార్ తెలిపారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని సౌమ్య విద్యామందిర్ పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయుల పాత్రలను పోషిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాఠశాల నిర్వహణను విద్యార్థులే చేపట్టి అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ హోదాల్లో విద్యార్థులు విధులు నిర్వహించడం చూసిన తల్లిదండ్రులు మురిసిపోయారు. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల ముందే ఉపాధ్యాయుల అవతారం ఎత్తిన విద్యార్థులు పాఠాలు బోధిస్తూ విశేషంగా మెప్పించారు.

ఉపాధ్యాయులు విద్యార్థులలోని ప్రతిభ, నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవకర్త బొడిగె రవీందర్, ప్రిన్సిపల్ బొడిగె విజయ్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లలలో మనోవికాసం, నాయకత్వ లక్షణాల పెంపొందునకు దోహదపడతాయని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఎంత బాధ్యతతో కూడుకున్నదో ఒకరోజు అనుభవంలో నేర్చుకున్నామని విద్యార్థులు తమ అనుభవాలను పంచుకున్నారు.

అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయ బృందం బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ బొడిగె రవీందర్, ఉపాధ్యాయులు బొడిగె రాణి, రుద్రారపు లావణ్య, మునుకుంట్ల వేణు, ఈరమళ్ల లూసిక, మునుకుంట్ల స్వాతి, బెల్లంకొండ రాజేశ్వరి, కోనేటి యాదగిరి, సురోజు హర్షిని, మంజుల తదితరులు పాల్గొన్నారు.