11 March, 2026 | 11:17 PM

యాంత్రీకరణతో అధిక దిగుబడులు

11-03-2026 09:04 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): యాంత్రీకరణ పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వం యంత్ర పరికరాలను అందిస్తుందని వ్యవసాయ యాంత్రీకరణ ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని అశ్వారావుపేట ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవరపు వీరభద్ర రావు చెప్పారు. బుధవారం వ్యవసాయ సాంకేంతిక  యాజమాన్య సంస్థ (ఆత్మ)  సహకారంతో మండల  వ్యవసాయ శాఖ, కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ములకలపల్లి మండలంలోని జగన్నాధపురం రైతు వేదికలో ఏర్పాటుచేసిన రైతు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఆత్మ పథకం ద్వారా నిర్వహించబడుతున్న ఈ శిక్షణ కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న యాంత్రికరణ పథకం వివరాలను వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఎరువుల వినియోగం, హెచ్ టి పత్తి సాగువలన నష్టాలు, పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం అలాగే వరిలో సన్న రకాలు వాటి ప్రాముఖ్యతను తెలిపారు. అశ్వారావుపేట డివిజనల్ ఏడి రవికుమార్ మాట్లాడుతూ రైతులు ఫార్మర్స్ రిజిస్ట్రీ చేయించుకోవాలని  యూరియా యాప్ వివరాలను వివరించారు.

విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ శరత్ మాట్లాడుతూ.... వరిలో తెగుళ్ల నివారణ,ఉద్యాన శాస్త్రవేత్త  బి శివ ఆయిల్ పామ్ సాగు కూరగాయపంటలకు ఉన్న స్కీంలు,తేనెటీగల పెంపకం,పంట మార్పిడి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల ఏవో అరుణ్ బాబు రైతులకు రైతు భరోసా, రైతు బీమా,పిఎం కిసాన్ పథకాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్, ముత్యాలంపాడు సర్పంచ్ కల్లూరి కిషోర్, పాత గంగారం సర్పంచ్ సోడే చైతన్య  ఆత్మ మెంబెర్స్ జగదీశ్, సంజీవరావు ఏ ఈ ఓ లు రమేష్, రాహుల్, రజనీకాంత్, సుజాత, రైతులు పాల్గొన్నారు.