విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ
శంకర్ తండా ప్రభుత్వ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ వెడుకలు
శివంపేట(విజయక్రాంతి): శివంపేట్ మండల పరిధిలోని శంకర్ తండా ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులే ఒక రోజు పాటు ఉపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించి, తమ నాయకత్వ ప్రతిభను చాటుకున్నారు. పాఠశాల వాతావరణం ఒక్కరోజు పండుగగా మారిపోయింది. విద్యార్థులు ఉపాధ్యాయులుగా దీక్షిత,వైష్ణవి, సింధుజ, లోకేష్, నవీన్ కుమార్ శ్రీకాంత్, అంగన్వాడీ టీచర్ గా శ్రీదేవి, శాన్విక వ్యవహరించారు.
ఉపాధ్యాయులుగా మారిన విద్యార్థులు తరగతుల్లో పాఠాలు బోధిస్తూ,తోటి విద్యార్థులను ఆకట్టుకున్నారు. బోధనలో వారు చూపిన నైపుణ్యం, ఆత్మవిశ్వాసం అందరినీ మెప్పించింది. విద్యార్థులు పాఠ్యాంశాలను సృజనాత్మకంగా వివరించడం, తరగతిలో క్రమశిక్షణ పాటించేందుకు చేసిన ప్రయత్నాలు ప్రశంసనీయంగా నిలిచాయి.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యతా భావం, సమన్వయ నైపుణ్యాలు పెంపొందించాలనే లక్ష్యంతో పాఠశాల ఉపాధ్యాయ బృందంఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించింది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంతో పాటు భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ప్రేరణనిస్తాయని ప్రధానోపాధ్యాయులు రేణుక మాల, అంగన్వాడీ టీచర్ విజయ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ మంజుల, రేణుక, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.




