18 May, 2026 | 5:34 PM

సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

18-05-2026 04:49 PM

...ఎమ్మెల్యే  కోవలక్ష్మికి వినతిపత్రం అందజేసిన రిటైర్డ్ కార్మికులు

ఆసిఫాబాద్ (విజయ క్రాంతి): సింగరేణి సంస్థలో రిటైర్మెంట్ పొందిన కార్మికుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సింగరేణి వాలంటరీ రిటైర్డ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (Reg.No:4148/97) ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధికి జీవితాంతం కష్టపడ్డ కార్మికులు రిటైర్మెంట్ అనంతరం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ.10 వేల పెన్షన్ ఇవ్వడంతో పాటు ప్రతి మూడు నెలలకు పెరిగే డీఏను పెన్షన్‌లో కలపాలని డిమాండ్ చేశారు. ప్రతి రిటైర్డ్ కార్మికుడికి 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, సొంత స్థలాలు ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీటి సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని రిటైర్డ్ కార్మికులకు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్మికులకు రూ.25 లక్షల వరకు వైద్య ఖర్చులను సింగరేణి సంస్థ భరించాలని, హెల్త్ కార్డు ద్వారా పూర్తిస్థాయి వైద్యం అందించాలని, ప్రతి రెండు నెలలకు అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వాలని కోరారు.  రిటైర్డ్ కార్మికులకు బస్సు, రైలు ప్రయాణాల్లో ఉచిత సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల పిల్లల పేర్లు, జనన తేదీలలో ఉన్న తప్పులను సరిదిద్దుకునే అవకాశం కల్పించి ఉద్యోగం ఇవ్వాలని, ఉద్యోగం వద్దనుకున్న వారికి రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బూడిది గోపాలకృష్ణ (డిప్యూటీ సూపరింటెండెంట్), గుర్రం గంగయ్య (ఈపీ ఆపరేటర్), పిడుగు నారాయణ (పీవోపీ), దుర్గం శంకర్ (కోల్ ఫిల్లర్), బాసబోయిన రవీంద్ర కుమార్ (ఈపీ ఆపరేటర్), కే. యాదగిరి, చిలుకూరి బాలయ్య, పోటు బాబు తదితర రిటైర్డ్ కార్మికులు పాల్గొన్నారు.