జనగణనలో ప్రజలు అపోహలు వీడండి
తూప్రాన్, మే 20 : తూప్రాన్ ఆర్డీఓ జయ చంద్రారెడ్ది మండలంలోని నాగులపల్లి గ్రామంలో జరుగుతున్న జనగణన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న గృహ గణన ప్రక్రియను పరిశీలించి, ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ ఈనెల 11 నుండి ప్రారంభమైన జనగణన కార్యక్రమం తూప్రాన్ డివిజన్ వ్యాప్తంగా కొనసాగుతున్నదని తెలిపారు.
ప్పటివరకు డివిజన్లో మొత్తం 52,689 ఇళ్లకు గాను 19,064 ఇళ్ల ఎన్యూమరేషన్ పూర్తి చేయబడిందని సుమారు 36 శాతం పూర్తయిందని పేర్కొన్నారు, జూన్ 9 నాటికి జనగణన ప్రక్రియను పూర్తి స్థాయిలో ముగించే లక్ష్యంతో అధికారులు పని చేస్తున్నారని తెలిపారు. ఈ జనగణన లో భాగంగా ఇంటిటికి సంబంధించిన వివరాలు ఇంటిస్థితి, గదుల సంఖ్య, వాహనాల వివరాలు తదితర సమాచారం ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు.
కొంతమంది ప్రజలు వాహనాల వివరాలు ఇస్తే రేషన్ కార్డులు తొలగిస్తారనే అపోహతో సమాచారం ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారని, అలాంటి భయాలు అవసరం లేదని, ఎవరి రేషన్ కార్డులు తొలగించ బడవని, ఈ సమాచారం కేవలం ప్రభుత్వ గణాంకాల కోసం మాత్రమే సేకరించ బడుతోందని స్పష్టం చేశారు. అలాగే ప్రజలు జనగణన కార్యక్రమానికి సహకరించి సరైన వివరాలు అందించాలని కోరారు.






