సీపీఎం పాదయాత్ర ఫలితమే సీతారామ ప్రాజెక్టు
2004లో దుమ్ముగూడెం నుంచి ఉద్యమం..
నాటి రాజీవ్‌సాగర్ నుంచి నేటి సీతారామ వరకు: సీపీఎం నేతలు
అశ్వాపురం,(విజయక్రాంతి): సీతారామ ప్రాజెక్టు తమ ఘనతేనంటూ ఈ రోజు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు పోటీపడి చెప్పుకోవడం కంటే, ఈ ప్రాజెక్టు వెనుక సాగిన రైతాంగ ఉద్యమ చరిత్రను గుర్తించాలని అశ్వాపురం మండల సీపీఎం నాయకులు అన్నారు. 2004లో దుమ్ముగూడెం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు సీపీఎం ఆధ్వర్యంలో తమ్మినేని వీరభద్రం చేపట్టిన పాదయాత్రతోనే దుమ్ముగూడెం వద్ద ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించాలనే డిమాండ్ బలంగా ముందుకు వచ్చిందని తెలిపారు.
అప్పటి ప్రభుత్వం కళ్లు తెరిపించేలా పాదయాత్ర సాగడంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2005లో దుమ్ముగూడెం వద్ద ‘రాజీవ్‌సాగర్’ పేరుతో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిందని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఎలకలగూడెం వద్ద పంప్‌హౌస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించి, అప్పట్లో సుమారు రూ.9 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు గుర్తుచేశారు. అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం అనంతరం ప్రాజెక్టు ముందుకు సాగలేదని తెలిపారు.
అనంతరం కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరుతో ప్రాజెక్టును రీడిజైన్ చేసి బీజీకొత్తూరు వద్ద పంప్‌హౌస్ ఏర్పాటు చేసి పనులు చేపట్టిందన్నారు. ప్రభుత్వం ఏదైనా, ప్రాజెక్టు పేరేదైనా తమదే ఘనత అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు రాజకీయ క్రెడిట్ కోసం పోటీ పడటం సరికాదని విమర్శించారు. దుమ్ముగూడెం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు సాగిన సీపీఎం పాదయాత్ర, రైతాంగ పోరాటాల ఫలితంగానే ఈ ప్రాంతానికి సాగునీటి ప్రాజెక్టు ఆలోచన బలపడిందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు చరిత్రను ప్రజలకు వాస్తవాలతో వివరించి, రాజకీయ ప్రచారానికి కాకుండా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.






