1 June, 2026 | 4:33 PM

Breaking News

రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి

01-06-2026 03:28 PM

ఏఐయుకేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపుడి రాము

దమ్మపేట,(విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్లో రైతాంగానికి  అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలని, పాత రుణాలు రద్దుచేసి కొత్తగా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, అఖిలభారత ఐక్య రైతు సంఘం దమ్మపేట మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసిల్దార్  కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఆర్.ఐ. బిక్షం కు మెమోరాడం సమర్పించారు.

ఈ సందర్భంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్లపుడి రాము మాట్లాడుతూ రైతాంగానికి అవసరమైన పనిముట్లు సగం సబ్సిడీపై ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, కనీస మద్దతు ధరలు నిర్ణయించి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, కల్తీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలని,కల్తీ విత్తన వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, అకాల వర్షాల వలన నష్టపోయిన అరటి, మామిడి ఇతర పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థని, మోదీ గొప్పలు చెప్పు కుంటున్నారని, అలాంటప్పుడు పెట్రోల్, డీజిల్, సి ఎన్ జి ధరలను దాదాపు ప్రతిరోజు ఎందుకు పెంచుతున్నదని, అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల, గ్రామీణ సంపన్న వర్గాల అనుకూల విధానాలన్నిటిని తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు.

దీనివలన  స్వామినాథన్ కమిషన్ సిఫారసులు ప్రకారం మన రైతాంగానికి తమ పంటలకు కనీస మద్దతు ధర(MSP) లభించడం లేదని వ్యవసాయ ఉత్పాదకాల( ఇన్ ఫుట్ )ధరలు నిరంతరం పెరుగుతున్నాయని అనారు. గ్రామీణ ప్రజలుకు భూమి లేని వారికి భూమి, ఇల్లు లేని వారికి ఇల్లు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వాలని, డిమాండ్ చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు, చిన్న సన్నకారు మరియు మధ్య తరగతి రైతులందరికీ పూర్తి రుణమాఫీ చేయాలని, కొత్తగా వడ్డీ లేని రుణాలు అందించాలని, రైతాంగ పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం మద్దతు ధరలు ఇవ్వాలని కోరారు.