11 May, 2026 | 4:32 AM

శాస్త్రీయ సాగు, ఆధునికత!

11-05-2026 02:58 AM
  1. వ్యవసాయ రంగం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
  2. ముగిసిన రైతు వారం కార్యక్రమాలు

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి) : ‘ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 4నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన రైతు వారం కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి.  వ్యవ సాయశాఖతో పాటు అనుబంధ శాఖలైన  ఉద్యానవన, పట్టు, విద్యుత్, మార్కెటింగ్, సహకార, పశుసంవర్ధక, మత్స్య, పౌర సరఫరాలు, నీటిపారుదల సమన్వయంతో రైతు వారం కార్యక్రమాలు నిర్వహించారు.

రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, శాస్త్రీయ వ్యవ సాయం, మార్కెటింగ్, యాంత్రీకరణ, పశుసంవర్ధక మరియు నీటిపారుదల అంశాలపై విస్తృత స్థాయిలో అధికారులు అవగాహన కల్పించారు. 14,565 మట్టి నమూనాలను సేకరించి, 20,734 మట్టి విశ్లేషణ పత్రాలను రైతులకు అందజేశారు. నానో ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, సన్న వరి సాగు వంటి అంశాలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించారు.

వినియోగదారులు కోరుకునే, మార్కెట్లో అధిక డిమాండ్ కలిగిన సన్న వరి రకాలు బీపీటీ 5204 , ఆర్ ఎన్ ఆర్ 15048, హెచ్‌ఎంటి, జైశ్రీరామ్,  కే ఎన్ ఎం.1638, డబ్ల్యూజిఎల్ 44, డబ్ల్యూజిఎల్ 962, జేజిఎల్ 1798 వంటి రకాలను సాగు చేయాలని రైతులకు శాస్త్రవేత్తలు సూచించారు. ప్రత్యామ్నాయ పంటల్లో ముఖ్యంగా ఆయిల్ పామ్, నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగు పై రైతులకు శిక్షణ ఇచ్చారు. అలాగే పంట రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, సహకార సంఘాల సేవలపై  శిక్షణ ఇచ్చారు. గోదాముల నిల్వ సదుపాయాలు, కనీస మద్దతు ధర , మార్కెటింగ్ అవకాశాలపై మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు వివరించారు.  వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.