సైఫై ఎంటర్‌టైనర్ షురూ
రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్‌టైనర్ ముస్తాబవుతోంది. ప్రముఖ దర్శకుడు వీఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్‌గా, డైలాగ్ రైటర్‌గా పనిచేసిన విజయ్ కే కామిశెట్టి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయన ‘టైగర్’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’, ‘స్వయంభు’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు కూడా పోషించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుకు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
వీఐ ఆనంద్ అందించిన కథ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను గుత్తా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇందులో సత్య, సుదర్శన్, రవితేజ నన్నిమాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో శుక్రవారం ప్రారంభమైందీ చిత్రం. హీరో నిఖిల్ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ కెమెరాను స్విచ్ ఆన్ చేశారు.
వీఐ ఆనంద్ స్క్రిప్టును చిత్రబృందానికి అందజేసి, ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించారు. ఫాంటసీ, రొమాన్స్, కామెడీ, మిస్టరీ, అత్యాధునిక సైన్స్ ఫిక్షన్ అంశాల కలయికతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం వేగంగా జరుగుతుండగా, రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించగా, అన్వేష్ వరాల సినిమాటోగ్రఫీని, చోటా కే ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.






