యూనిఫామ్ జాడేది?
పాఠశాలలు ప్రారంభమై నెల రోజులైనా..
మహబూబాబాద్, జులై 12 (విజయక్రాంతి): విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే వీరాదిమంది విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫామ్ పంపిణీ చేయలేదు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 787 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో సుమారు 39 వేల మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతంలో ప్రభుత్వం విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఒక్కో జత దుస్తులు (యూనిఫామ్) అందించి తర్వాత మరో జత అందించేది.
అయితే ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నప్పటికీ యూనిఫామ్ పంపిణీ అంశాన్ని ఎవరు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్ర భుత్వ పాఠశాలలో దాదాపు చదువుకునే పిల్లలంతా పేద వర్గాలకు చెందిన వారే కావడం వల్ల వారికి సరైన దుస్తులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు రెండు జతల దుస్తులతో పాటు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉదయం అల్పాహారం, వర్క్ బుక్కులు, ఇతర సదుపాయాలు కల్పిస్తామని, ఒక పైసా ఖర్చు లేకుండా పేద పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన అందించడంతోపాటు విద్యార్థులకు అవసరమైన వ సతులు, సౌకర్యాలను కల్పిస్తామని ప్రభు త్వం ప్రకటించింది. ఇందులో భాగంగా వి ద్యార్థులకు రెండు జతల దుస్తులు అందించాల్సి ఉండగా, కనీసం ఒక జత దుస్తులు కూడా ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటివరకు విద్యార్థులకు అందించే దుస్తులకు సంబంధించిన విషయంపై విద్యాశాఖ అధికారులు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు దుస్తులు తామే ఏర్పాటు చే యాలా, ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఒకే తరహాలో ఉండే విధంగా యూనిఫాం అందించేది. ఈసారి యూనిఫామ్ రం గు మార్చాలని యోచన చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
దీనివల్ల యూనిఫాం అందించడానికి జాప్యం జరుగుతున్నట్లు చె బుతున్నారు. అయితే కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న బాలికల కు యూనిఫాం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారని, విద్యార్థులకు మాత్రం యూనిఫామ్ విషయంలో ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదని, కేసముద్రం ఎంఈవో యాదగిరి తెలిపారు. ప్రభుత్వం నుండి యూని ఫాం వచ్చిన వెంటనే విద్యార్థులకు అందజేస్తామని, ఇప్పటివరకు యూనిఫామ్‌కు సంబంధించిన సమాచారం ఏదీ లేదని ఆయన స్పష్టం చేశారు.






