29 March, 2026 | 4:05 AM

ధిక్కార స్వరం సర్దార్ కేశవరావు

29-03-2026 02:21 AM

తెలంగాణ గడ్డపై ఉదయించిన ధిక్కార స్వరం, నిజాం నిరంకుశత్వానికి ఎదురునిలిచిన అజేయ శక్తి సర్దార్ జమలాపురం కేశవరావు. అణచివేతకు గురైన ప్రజల ఆత్మగౌరవ ప్రతీకగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా ఆయన సాగించిన ప్రస్థానం అద్వితీయం. నిజాం నిరంకుశత్వాన్ని, భూస్వామ్య అణచివేతను ఏకకాలంలో ఢీకొన్న ధీశాలి ఆయన. ఒక జమీందారీ కుటుంబంలో పుట్టి సకల సౌకర్యాలను కాలదన్నుకున్నారు.

పీడిత ప్రజల కోసం పల్లేరు గాయల దారిలో నడిచిన ఆయన జీవితం తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువుటద్దం. 1908 సెప్టెంబర్ 3న నాటి వరంగల్ జిల్లా ఎర్రుపాలెంలో జమలాపురం వెంకట రామారావు, వెంకట నరసమ్మ దంపతులకు కేశవరా వు జన్మించారు. చిన్నతనం నుంచే ఆయన చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితులను గమనిస్తూ పెరిగారు. ప్రాథమిక విద్య అనంతరం హైదరా బాద్ లోని ప్రఖ్యాత నిజాం కళాశాలలో కేశవరావు ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ కాలంలో నిజాం ప్రభుత్వం విద్యాసంస్థల్లో ‘వందేమాతరం’ గీతాన్ని నిషేధించింది. ఇది విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది.

కేశవరావు ముందుండి విద్యార్థులను సం ఘటితం చేశారు. హాస్టల్ గదుల్లో వందేమాతరం గీతాన్ని ఆలపించి నిజాం ఆంక్షలను ధిక్కరించారు. ఈ పోరాటమే ఆయనను ఒక పరిణతి చెందిన నాయకుడిగా తీర్చిదిద్దింది. విద్యార్థి దశలోనే ఆయనలో జాతీయవాదం, తెలంగాణ విముక్తి కాంక్ష పెనవేసుకుపోయాయి. 1923 లో రాజమండ్రిలో జరిగిన సభలో గాంధీజీ ప్రసంగాన్ని విన్న కేశవరావు ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు.

ఖద్దరు ధరించడం, సత్యం, అహింసను ఆచరించడం తన జీవనశైలిగా మార్చుకున్నారు. 1930లో విజయవా డలో గాంధీజీని స్వయంగా కలిసి తెలంగాణ పరిస్థితులను వివరించారు. గ్రామీణ పరిస్థితులను లోతుగా అర్థం చేసుకోవడానికి ఆయన వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో సుదీర్ఘంగా కాలినడకన పర్యటించారు. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన తెలంగాణ చరిత్రలో ఒక కీలక మలుపు.

ఆ సంస్థకు కేశవరావు ప్రథమ సత్యాగ్రహ దళాధిపతిగా వ్యవహరించారు. నిజాం ప్రభుత్వం స్టేట్ కాంగ్రెస్‌దీ తిజిజిపై నిషేధం విధించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. 1938లో మధిరలో నిర్వహించిన సత్యాగ్రహం ఆయన ధైర్యానికి పరాకాష్ట. పోలీసులు ఆయనను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో రైతు వేషంలో గుంపులో కలిసిపోయి వేదికపైకి చేరుకున్నారు. ఒక్కసారిగా తన అసలు రూపం దాల్చి నినాదాలు చేస్తూ ప్రజల్లో ఉత్తేజం నింపారు. ఈ సంఘటన తర్వాత ఆయనకు 18 నెలల కఠిన జైలు శిక్ష పడింది.

1948 సెప్టెంబర్ లో పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అయితే మిలిటరీ పాలనలో సామాన్య ప్రజలు మళ్లీ ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో కేశవరావు మౌనంగా ఉండలేదు. భారత ప్రభుత్వం నియమించిన శక్తివంతమైన అధికారులను ఆయన బహిరంగంగా ఎదిరించారు. ఆయన పోరాట పటిమను చూసి ప్రజలు ఆయనను ‘దక్కన్ సర్దార్’ అని, ‘తెలంగాణ కేసరి’ అని పిలుచుకునేవారు. ఆయన 1953 మార్చి 29న తన 46వ ఏటనే కన్నుమూశారు. సర్దార్ జమలాపురం కేశవరావు జీవితం మనకు నేర్పే పాఠాలు అనేకం. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరించాలని, పదవుల కంటే ప్రజా శ్రేయస్సే ముఖ్యమని ఆయన నిరూపించారు. ఆయన ఆశయాలను స్మరించుకోవడం ఆయనకు అర్పించే నివాళి 

      రామకిష్టయ్య సంగనభట్ల, సెల్: 94405 95494