భక్తి పారవశ్యంలో సమ్మక్క సారలమ్మ ప్రతిష్ఠ మహోత్సవాలు
నేటి నుంచి మూడు రోజుల పాటు వైభవంగా ఆధ్యాత్మిక వేడుకలు
ప్రత్యేక పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు పూర్తి
27 నుండి 29 వరకు భక్తి కార్యక్రమాలు
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ పిలుపు
పాల్వంచ, మే 27 (విజయక్రాంతి): పాల్వంచ మండల పుల్లయ్యగూడెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సమ్మక్కసారలమ్మ ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. మూడు రోజుల పాటు భక్తిశ్రద్ధల నడుమ ప్రత్యేక పూజలు, హోమాలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి ముస్తాబు చేయడంతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. మహోత్సవాల తొలి బుధవారం ఉదయం మంగళవాయిద్యాల నడుమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గౌరీదేవతల పూజలు, బోనాల సమర్పణ, సమ్మక్కసారలమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మే 28న హోమాలు, ప్రత్యేక అభిషేకాలు, ఓడి బియ్యం కార్యక్రమం, అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు.
అమ్మవారికి ప్రత్యేక కళ్యాణం నిర్వహించనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మహోత్సవాల చివరి రోజు మే 29న గంగస్నానం, ప్రత్యేక నైవే ద్యాలు, తీర్థప్రసాదాల పంపిణీతో పాటు ముగింపు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. మహోత్సవాల విజయవంతానికి గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు అందరూ సహకరించాలని ఆలయ కమిటీ విజ్ఞప్తి చేశారు.






