21-02-2026 12:07:40 AM
అపోలో హాస్పిటల్స్‌లో క్లినిక్ ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 20(విజయక్రాం తి): అంతర్జాతీయ యూరోగైనకాలజీ దినోత్స వం సందర్భంగా అపోలో హాస్పిటల్స్ జూబిలీ హిల్స్‌లో శుక్రవారం ‘సఖి’ పేరుతో ప్రత్యేక యూరోగైనకాలజీ క్లినిక్‌ను ప్రారంభించింది. మహిళలు మౌనంగా భరించే పెల్విక్ ఆరోగ్య సమస్యలకు గౌప్యతతో కూడిన నిపుణుల వైద్యం అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమ ని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
మూత్ర, మల సమస్యలు, తరచూ మూత్రపిండ ఇన్ఫెక్షన్లు, గర్భాశయ భాగం జారిపోవడం (ప్రోలాప్స్), పెల్విక్ నొప్పులు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇబ్బందులు వంటి సమస్యలను చాలామంది మహిళలు వయసు ప్రభావం లేదా ప్రసవ ఫలితంగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆలస్యంగా వైద్యులను సంప్రదించడం వల్ల శారీరకంతో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోందని పేర్కొన్నారు.
ఈ క్లినిక్‌ను సీనియర్ యూరోగైనకాలజిస్టులు డాక్టర్ నిర్మల పాపల్కర్ , డాక్టర్ శ్రీజ గుర్రాల నాయకత్వం వహిస్తున్నారు. మహిళల గోప్యతను కాపాడే విధంగా పూర్తిగా మహిళా సిబ్బందితో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే ఫోన్ ద్వారా సలహాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు.
ఈ సందర్భంగా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల సీఈఓ తేజస్విరావు వీరేపల్లి మాట్లాడుతూ, ఇది సామూహిక ప్రచార కార్యక్రమం కాదని, ప్రత్యేక వైద్య సహాయం అవసరమైన మహిళలకు నమ్మకంతో కూడిన సేవలు అందించే లక్ష్యంతో ప్రారంభించిన ప్రయత్నమని తెలిపారు. అవగాహన పెంపుతో పాటు సమగ్ర చికిత్సను ఒకే చోట అందించడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు.‘సఖి’ ద్వారా మహిళలు మౌనంగా బాధపడకుండా ముందుకు వచ్చి వైద్య సలహా తీసుకుని తమ ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం తిరిగి పొందాలని ఆస్పత్రి యాజమాన్యం పిలుపునిచ్చింది.