మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, జూలై 21 (విజయక్రాంతి) : మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని జి ల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసు ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో గత ఆరు నెలలుగా జిల్లా వ్యాప్తంగా మహిళలను, చిన్నారులను, పాఠశాల విద్యార్థులను వివిధ రకాలుగా వేధించిన వారికి షీ టీం ద్వారా కౌన్సిలింగ్, పెట్టి కేసులు నమోదైన 180 మంది ఆకతాయిలు, వారి కుటుంబ సభ్యులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
జిల్లాలో మహిళల, విద్యార్థుల పట్ల, వారి భద్రత పట్ల ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వారి రక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా విధుల నిర్వహణ, మహిళలను చిన్నారులను వేధించే వారిపై కఠినమైన చర్యలతో అణచి వేస్తున్నామన్నారు. గత ఆరు నెలల కాలంలో జిల్లాలో 230 పెట్టి కేసులు, 20 కి పైగా ఎఫైర్ కేసులు నమోదయ్యాయని, ఈ కేసులలో నిందితులుగా ఉన్నటువంటి వారిని, వారి తల్లిదండ్రులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి, వారి ఎదుట ఆక తాయిలకు అవగాహన కల్పించామన్నారు.
మహిళలను వేధించిన ఆకతాయిలు సోషల్ మీడియాలో, వాట్సాప్ ఇంస్టాగ్రామ్ లలో, యువతులను వేధిస్తూ మెసేజ్లు పంపడం, పాఠశాలల వ ద్ద, కళాశాలల వద్ద విద్యార్థులను వేధించడం, ప్రేమ పేరుతో వేధించడం, వివాహిత మహిళలను బస్టాప్ ల వద్ద, వాట్సాప్ ద్వారా వేధించడం, గతంలో ఉన్న ప్రేమను ప్రస్తుతం వివాహం జరిగిన తర్వాత బెదిరిస్తూ బ్లాక్మెయిలింగ్ కి పాల్పడడం, మహిళలకు వారి ఫోన్ నెంబర్లకు కాల్స్ చే స్తూ వేధించే పనులు మానుకోవాలని, ఇలాంటి వారిపై పెట్టి కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఇది చివరి అవకాశంగా సూచిస్తూ, ఇక నుండి మహిళలను చిన్నారులను వేధించే వారిపై ఎఫ్‌ఐఆర్ కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చెడు సావాసాలను మానుకోవాలని, మంచి తనంతో, మంచి ప్రవర్తనతో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక, ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె ఫణిదర్, షీ టీం బృంద సభ్యులు సుశీల, వాణిశ్రీ, తదితరులు పాల్గొన్నారు.






