ఆర్టీసీకి డీజిల్ పోటు
నెలకు రూ.14.40 కోట్ల అదనపు భారం
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతుండటంతో ఆర్టీసీపై భారం పడుతున్నది. దీంతో ఆర్టీసీ నడ్డి విరగనున్నది. డీజిల్ ధరలు ఒక్క రూపాయి పెరిగినా భారీగా అదనపు భారం పడుతుంది. ఈ లెక్కన ఇప్పటి వరకు కేంద్రం నాలుగు సార్లు రేట్లను పెంచడంతో డీజిల్ ధర రూ.8కు పెరిగింది. దీంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడుతున్నది. రోజుకు 6 లక్షల లీటర్ల డీజిల్‌ను ఆర్టీసీ వాడుతున్నది. ఆర్టీసీ మొత్తం 10,130 బస్సులను రాష్ట్రవ్యాప్తంగా నడుపుతున్నది.
అంటే రోజుకు రూ.48 లక్షల అదనపు భారం పడుతుండగా, అదే నెలకు రూ.14.40 కోట్ల అదనపు భారం పడనున్నది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ లాభాల్లో నడుస్తుందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఈ డీజిల్ ధరల పెంపుతో తీవ్ర భారం పడుతున్నది. అసలే మహాలక్ష్మి డబ్బులు చెల్లించడంలేదని ఆర్టీసీ యూనియన్ నేతలు ఒక పక్క చెప్తుంటే ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడం సంస్థకు మరింత నష్టం చేకూరినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






