8 August, 2026 | 4:45 AM

ఏదులాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.100 కోట్లు

08-08-2026 01:21 AM
  1. ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాం
  2. ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌళిక వసతుల కల్పనకు క్షేత్రస్థాయిలో పర్యటన
  3. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
  4. ఏదులాపురం మున్సిపాలిటీలో మార్నింగ్ వాక్ నిర్వహించి అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి

ఖమ్మం, ఏదులాపురం, ఆగస్టు 07(విజయక్రాంతి): ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచర ణతో ముందుకు సాగుతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22, 23వ వార్డులైన సాయిగణేష్ నగర్, సత్యనారాయణపురం, ఇందిరమ్మ కాలనీలలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్తో కలిసి కాలినడకన కాలనీల్లో తిరుగుతూ మంత్రివర్యులు అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య పరిస్థితులు, ప్రజా మౌళిక వసతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

స్థానికులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను విలీనం చేసి ఏర్పాటు చేసిన ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేశారని చెప్పారు.

ప్రజలకు అవసరమైన మౌళిక వసతులను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకే క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నామని పేర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో తుమ్మ చెట్లు పెరగడం, రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటి శాశ్వత పరిష్కారం కోసం అవసరమైన డ్రైనేజీ నిర్మాణంతో పాటు ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందిస్తు న్నట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటి సమస్య ఉందని స్థానికులు తమ దృష్టికి తీసుకువచ్చారని, దానిని త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు.

విద్యుత్ తీగలకు సంబంధించిన సమస్యలను కూడా సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరిస్తామని తెలిపారు. కొంతమంది ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాల కోసం వినతులు అందజేశారని, వాటిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో పార్కుల అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయని, ఈ నెలాఖరు లోగా వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రతి పనిని నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు.

సాయిగణేష్ నగర్ లో రోడ్డు వెంట ఉన్న టీ స్టాల్ లో కూర్చుని టీ త్రాగి అనంతరం ఇందిరమ్మ కాలనీలో పర్యటించారు. వర్షం పడుతున్న కాలి నడకన గొడుగు చేత పట్టుకుని తిరిగి పరిసరాలను పరిశీలిస్తూ కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఏదులాపురం మునిసిపల్ చైర్ పర్సన్ అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్,  ఆర్ అండ్ బి ఎస్‌ఈ యుగంధర్, పంచాయతీ రాజ్ ఎస్.ఈ. వెంకట్ రెడ్డి, ఏదులాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాస చారి, హౌసింగ్ పీడీ శ్రీనివాస్, ఆర్డీఓ శ్రీనివాస్, సంబంధిత అధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు, కాలనీవాసులు పాల్గొన్నారు.