ఎరువుల కొరత రాకుండా పకడ్బందీ చర్యలు
బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు :- కలెక్టర్ రాజర్షి షా
గుడిహత్నూర్, ఆగస్టు 12 : జిల్లాలో రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. వర్షాకాల సాగు నేపథ్యంలో బుధవారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోని యూరియా గోదామును, యూరియా బుకింగ్ ప్రక్రియను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములో అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు, స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ వివరాలను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.
అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా బుకింగ్ యా ప్ ద్వారా రైతుల నమోదులు, బుకింగ్ విధానం, పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతుల అవసరాలకు అనుగుణంగా సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఎరువులను నిర్ణీత గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్పీ)కే విక్రయించాలని, అధిక ధరలకు విక్రయించడం, అక్రమంగా నిల్వ చేయడం లేదా పక్కదారి పట్టించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట పీఏసీఎస్ సిబ్బంది పూర్ణచందర్, రైతులు తదితరులున్నారు.






