30 August, 2026 | 1:47 AM

‘సీతా మెడోస్’లో నరకప్రాయంగా మారిన రహదారులు

30-08-2026 12:00 AM

విన్నతులన్నీ బుట్ట దాఖలు

అధికారుల నిర్లక్ష్యం

బడంగ్పేట్, ఆగస్టు 29 (విజయక్రాంతి): బడంగ్పేట్ పరిధిలోని సీతా మెడోస్లో రహదారుల పరిస్థితి దయనీయంగా మారింది. గత ఎనిమిది నెలలుగా రోడ్డు పనులను సగంలోనే తవ్వి వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై ఏర్పడిన భారీ గుంతల్లో వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తుండటంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మ్యాన్హోళ్లు బయటపడి, కంకర రాళ్లు, బురదతో రాత్రి వేళల్లో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. 

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని..

చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేసి తమకు నరకం నుండి విముక్తి కల్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.