30 August, 2026 | 3:58 AM

26 నుంచి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

30-08-2026 01:45 AM
  1. వేములవాడలో నిర్వహణ
  2. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, ఆగస్టు 29 (విజయక్రాం తి): గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసి జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా వేములవాడలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. సెప్టెంబరు 26 నుంచి 29 వరకు అండర్-20 బాలుర,

అండర్-16 బాలికల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. శనివారం వేములవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాలతో పాటు హైదరాబాద్‌ను రెండు జట్లుగా పరిగణించి 34 బాలుర, 34 బాలికల జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఒక్కో జట్టులో 14 మంది క్రీడాకారులతో పాటు ఇద్దరు అధికారులు ఉంటారని,

మొత్తం సుమారు 1,358 మంది టోర్నీలో పాల్గొంటారన్నారు. ఇప్పటికే వేములవాడలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించామని, అదే స్ఫూర్తితో కబడ్డీ పోటీలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

క్రీడాకారులకు వసతి, భోజనం తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు.యువత క్రీడల వైపు మళ్లడంతో పాటు చెడు వ్యసనాలకు దూరంగా ఉండేందుకు క్రీడలు దోహద పడతాయన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలకు ప్రాధాన్య మిస్తూ స్పోర్ట్స్‌యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు సీఎం కప్ ద్వారా గ్రామీ ణ స్థాయి నుంచి పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.

పోటీలకు క్రీడల శాఖ మంత్రి శ్రీహరి, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబులను ఆహ్వానించినట్లు చెప్పారు.ఈ పోటీలను విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, క్రీడా సంఘాలు, క్రీడాభిమానులు, మీడియా సహకరించాలని ఆది శ్రీనివాస్ కోరారు.