రోడ్డు భద్రత అంటే ప్రాణాలకు భద్రత
పోలీస్ కమీషనర్ సునిల్ దత్
కూసుమంచి, జూన్ 10 (విజయక్రాంతి): రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి ప్రాణాలకు రక్షణగా నిలిచే అత్యవసరమైన అంశమని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామంలోని పీవి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గ్రామసభలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ... రోడ్డుపై ప్రతి ఒక్కరి బాధ్యతాయుతమైన ప్రవర్తన ఎంతో మంది కుటుంబాల జీవితాలను కాపాడుతుందన్నారు. ప్రయాణికులందరూ సురక్షి తంగా గమ్యస్థానానికి చేరుకోవడానికి ఇది దోహదపడుతుందన్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం, వాహనం నడిపేటప్పుడు ఏకాగ్రత వహించడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఎన్నో ప్రాణాంతక ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు.
హెల్మెట్ ను ధరించాలని, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలన్నారు. వాహనాన్ని పరిమిత వేగంతో మాత్రమే నడపాలని, వేగం పెరిగే కొద్దీ ప్రమాదాలు జరిగే అవకాశం, వాటి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందన్నారు. మద్యం, మత్తు పదార్థాలను సేవించి ఎప్పుడూ వాహనం నడపకూడదన్నారు. వాహనదారులు సైతం పాదచారులకు ప్రాధాన్యత ఇవ్వాలని, డ్రైవింగ్ లైసెన్స్, వాహనం రిజిస్ట్రేషన్ పత్రాలు ఇన్సూరెన్స్, పీయూసీ సర్టిఫికేట్ వెంట ఉంచుకోవాలన్నారు.
ఇటీవల కూసుమంచి మండలంలో యాక్సిడెంట్ కు గురై న బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సలహాలు సూచనలు ప్రజలకు తెలియజేశారు. అదేవిదంగా ప్రమాదానికి గురై చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ధర్మ తండా చెందిన జర్పుల లలిత కుమారుడు సందీప్ యాక్సిడెంట్ గురై చనిపోయిన బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఖమ్మం రూరల్ ఏసిపి తిరుపతి రెడ్డి, కూసుమంచి సీఐ టి.సంజీవ్, ఎస్‌ఐ లు నాగరాజు, జగదీష్, సంతోష్, స్రవంతి, దివ్య, కూసుమంచి ఎమ్మార్వో, ఎంపీడీవో, అగ్రికల్చర్ ఏవో , ఎంఈఓ, ఆర్ & బి డిపార్ట్మెంట్, ఇతర అధికారులు, స్థానిక గ్రామ సర్పంచ్ కాంచారి సైదమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






