వేగం కన్నా ప్రాణం చాలా విలువైంది
హైదరాబాద్: వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి. పరిపాలనలో వేగం, పారదర్శకత, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక పేరుతో తెలంగాణ ప్రజాప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయం చేస్తూ 99 రోజుల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగా వారం రోజుల పాటు రోడ్డు భద్రతకు సంబంధించి వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం అరైవ్ అలైవ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నదన్నారు.
ఆదివారం ములుగు జిల్లా మేడారం జంగాలపల్లిలో తెలంగాణ పోలీస్ విభాగం వారు నిర్వహించిన రోడ్డు భద్రతా ఉత్సవాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఎమ్మెల్యే ఆదినారాయణ, జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ , గ్రంథాలయ చైర్మన్ , జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ... వేగం కన్నా ప్రాణం చాలా విలువైందని, వాహనదారులు చేసే పొరపాటుల వల్ల తమ ప్రాణాలను కోల్పోతున్నారని, అంతేకాదు కొందరి నిర్లక్ష్యంతో ఎదుటి వారికి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. అలా రాష్ట్రంలో రోజుకు 20, సంవత్సరానికి 7500 మంది ప్రాణాలు సగటున కోల్పోతున్నారని ఆయన వాపోయ్యారు. అదేవిధంగా దేశంలో సుమారు 1 లక్ష 50 వేల మంది ప్రమాదాల్లో మరణిస్తున్నారని, ఇంకా వీరితో పాటు ఎందరో ప్రమాదాల్లో గాయపడి అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.
ఒక ప్రమాదంలో వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం చెల్లాచెదురవుతుందని, అలాంటి సంఘటనలు మనకు అనేకం కనిపిస్తాయి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు మనం బతికి ఉండాలి. మద్యం తాగి వాహనం నడపడం, సీటు బెల్టు పెట్టుకోకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం చాలా ప్రమాదకరమన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు, ట్రాఫిక్ నియమాలను సక్రమంగా పాటించి క్షేమంగా ఇంటికి చేరుకోవాలి.






