19 April, 2026 | 5:24 PM

తెలంగాణ జాగృతిలో చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

19-04-2026 04:13 PM

హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాథోడ్ బాబురావుకు జాగృతి కండువా కప్పి ఆహ్వానించారు. అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో కవిత వారం రోజుల పాటు మెడికల్ క్యాంపు పెట్టారు. కవిత ఇచ్చిన ధైర్యంతోనే తను ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చానని రాథోడ్ బాబురావు పేర్కన్నారు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు.

వృత్తిరీత్య ఉపాధ్యాయుడైన బాపురావు 2009లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2009 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్ర నాయకుడిగా పనిచేసిన బాబురావు 2014లో తెలంగాలో జరిగిన తెలంగాణ  తొలి సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జాదవ్ అనిల్ కుమార్‌పై 26వేలకు పైగా ఓట్ల అధిక్యంతో విజయం సాధించారు. అలాగే 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోయం బాబు రావుపై 6వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలిచారు.

అయితే 2023లో నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో అక్టోబర్ 18న భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి నవంబర్ 01న ఢిల్లీలో కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరాడు. 2023లో బీఆర్‌ఎస్‌ టికెట్‌ నిరాకరించడంతో బీజేపీలో చేరిన బాబురావు ఆ తర్వాత కొద్దికాలానికే ఏప్రిల్‌ 2024లో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బాబురావు ఇవాళ తెలంగాణ జాగృతిలో చేరడం సంచలనంగా మారింది. బాబురావు బోథ్ నియోజకవర్గంలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నాయకుడు జాగృతిలో చేరడం అటు కాంగ్రెస్‌కు, ఇటు బీఆర్‌ఎస్‌ కు కొంత నష్టమనే రాజకీయ వర్గాలు తెలిపాయి.