14 August, 2026 | 5:12 PM

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ, రోడ్డు సౌకర్యం కల్పించాలి

14-08-2026 03:50 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని పీడీఎస్యూ కొమురంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ 1992లో అప్పటి అధికారులు ప్రభుత్వ జూనియర్ కళాశాల కోసం సుమారు 10 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. అయితే కళాశాల భవన నిర్మాణం నాటికి కేవలం రెండున్నర ఎకరాలు మాత్రమే మిగిలిందన్నారు.

మిగిలిన భూమి ఆక్రమణకు గురైందని ఆరోపించారు. ప్రహరీ గోడ లేకపోవడంతో గత కొంతకాలంగా మరికొంత భూమి కూడా ఆక్రమణకు గురవుతోందని పేర్కొన్నారు.కళాశాలకు కేటాయించిన భూమిని విద్యార్థుల క్రీడలు, భవిష్యత్‌లో నూతన భవనాల నిర్మాణానికి మాత్రమే వినియోగించాలని కోరారు. కళాశాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక విద్యార్థులు, సిబ్బంది బురదలో నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.

కళాశాల భూమిని కాపాడేందుకు ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు వెంటనే బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షుడు అయ్యుబ్‌ఖాన్, ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు సమీర్, కార్యదర్శి జగజంపుల తరుణ్, నాయకులు శివశంకర్, బౌరే వసంత్, కళాశాల కమిటీ కన్వీనర్ సాయిచరణ్, కో-కన్వీనర్లు రవి, సమీర్, సిరాజ్, చందన్, రత్నాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.