సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలి
పదోన్నతి పొందిన ఏఆర్ ఎస్‌ఐలకు సీపీ అంబర్ కిశోర్ ఝా అభినందనలు
పెద్దపల్లి,(విజయక్రాంతి): పోలీసు శాఖలో అప్పగించిన బాధ్యతలను అధికారులు సమర్థవంతంగా, నిబద్ధతతో నిర్వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. ఏఆర్ హెడ్ కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల ఏఆర్ ఎస్‌ఐలుగా పదోన్నతి పొందిన టీ.మోహన్, ఎస్.సత్తయ్యలు శుక్రవారం పోలీస్ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ అంబర్ కిశోర్ ఝా పదోన్నతి పొందిన అధికారుల భుజాలపై పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందనలు తెలిపారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పదోన్నతి అనేది మరింత బాధ్యతతో పనిచేసే అవకాశమని పేర్కొన్నారు. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తూ పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఉన్నతాధికారుల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా విధులు నిర్వహించాలని సీపీ తెలిపారు. పదోన్నతి పొందిన అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వర్తిస్తూ పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, రమేష్, ఆర్‌ఐలు దామోదర్, రమేష్, ఆర్‌ఎస్‌ఐ పోచలింగం, సీసీ హరీష్ తదితరులు పాల్గొన్నారు.






