26 August, 2026 | 2:30 AM

ఏజెన్సీ గిరిజనులకు 75% కోటా ఇవ్వాలి

25-08-2026 10:39 PM

కానిస్టేబుల్ పోస్టుల్లో హక్కులు కాపాడాలి

తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): రాష్ట్రంలో చేపడుతున్న పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో షెడ్యూల్డ్ ఏరియా (ఏజెన్సీ) ప్రాంతాలకు చెందిన గిరిజన నిరుద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కులను తక్షణమే పరిరక్షించాలని తెలంగాణ గిరిజన సమాఖ్య (టీజీఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సీఎస్టీ) సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ ను టీజీఎస్ నాయకులు మంగళవారం కలిసి సమస్యలతో కూడిన సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతాల్లోని స్థానిక గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కేవలం ఉపాధి మాత్రమే కాదని, ఆర్టికల్ 244(1), 5వ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగం అందించిన ప్రత్యేక రక్షణలని స్పష్టం చేశారు. గతంలో 2018 నోటిఫికేషన్ వరకు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోని ఏజెన్సీ పోలీస్ స్టేషన్లలో సివిల్ కానిస్టేబుల్ ఖాళీలలో స్థానిక ఎస్టీ, ఆదివాసీ అభ్యర్థులకు 75 శాతం ప్రత్యేక స్థానిక రిజర్వేషన్ అమలయ్యేదని గుర్తుచేశారు.

ప్రస్తుత 2026 నియామక ప్రక్రియలో ఈ 75 శాతం ప్రత్యేక రిజర్వేషన్ నిబంధనను స్పష్టంగా పేర్కొనకపోవడం అత్యంత విచారకరమని, దీనివల్ల ఏజెన్సీ ప్రాంత నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్‌సీఎస్టీ (ఆర్టికల్ 338A) వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం, హోం శాఖ, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, గిరిజన సంక్షేమ శాఖల నుంచి తక్షణ వివరణ కోరాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోత్ వెంకట్, జిల్లా గిరిజన నాయకులు జరుపుల ఉపేందర్, లావుడియా హరి మరియు ఇతర గిరిజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.