19 May, 2026 | 3:58 AM

శిథిలావస్థ భవనాలపై పర్యవేక్షణ ఏది?

19-05-2026 12:05 AM
  1. నిర్లక్ష్యంతో.. దేవరకద్రలో కూలిన రైస్ మిల్ గోడ 
  2. ముందస్తు చర్యలు తీసుకుంటేనే మేలు
  3. మున్సిపాలిటీలతోపాటు గ్రామాల్లో పర్యవేక్షణ చేయాల్సిందే..
  4. నిర్లక్ష్యం వహిస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు

మహబూబ్ నగర్ మే 18 (విజయక్రాంతి): శిథిలావస్థలో భవనాలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల దేవరకద్రలో ఓ రైస్ మిల్ గోడ కురిసిన వర్షం కారణంగా ఒక్కసారిగా కూలిపోవడంతో పక్కనే ఉన్న నూతన గృహం తో పాటు పక్కనే ఉన్న ఐస్ ఫ్యాక్టరీపై శిథిలాలు పడడంతో నష్టం వాటిల్లింది.

బడా బాబులు తన పలుకుబడిన ఉపయోగించి వారికి ఉన్న భవనాలకు సంబంధించి శిథిలావస్థకు చేరినప్పటికీ కూల్చకపోవడంతో ఇలాంటి ప్రమాదాలకు ఆ భవనాలు నిలయంగా మారుతున్నాయి. అధికారులు సైతం శిథిలావస్థల భవనాలకు సంబంధించి యజమానులకు నోటీసులు ఇవ్వాల్సి ఉండగా ఆ ప్రయత్నాలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు చెబుతున్న మాట. ఇప్పటికైనా అధికార యంత్రం ప్రత్యేక పర్యవేక్షణ చేసి శిథిలావస్థకు చేరుకున్న భవనాలకు నోటీసులు ఇచ్చి వెంటనే కూల్చివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోకపోతే భారీ వర్షాలకు ఈ శిథిలావస్థ భవనాల వల్ల ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా?

అధికారులు శిథిలావస్థకు గురైన పవనాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎక్కడ ఎలాంటి భవనాలు కూలిన పక్కనే ఉన్న ఇతర భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు ప్రాణాలు పోయే పరిస్థితులు లేకపోలేదు. ప్రమాదాలు జరిగిన తర్వాత హుటాహుటిన స్పందించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇప్పటికైనా అధికారులు శిథిలావస్థ భవనాల తొలగింపుకు సంబంధించి ప్రత్యేక అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పర్యవేక్షణ నిల్..

జిల్లాలోని కార్పొరేషన్ తో పాటు మూడు మున్సిపల్ టీలు, గ్రామపంచాయతీల పరిధిలో శిథిలావస్థ భవనాలు ఎన్నో ఉన్నాయి. గ్రామపంచాయతీ అధికారులతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసి తొలగింపుకు చర్యలు తీసుకుంటేనే మేలు జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రజల చెబుతున్న మాట. ఇప్పటికైనా అధికార యంత్రం అటువైపు అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.