19 May, 2026 | 4:58 AM

మక్కలతో నిండిన మార్కెట్ యార్డు

19-05-2026 12:00 AM

కేసముద్రంలో 3,73,470 బస్తాల కొనుగోళ్లు

కేసముద్రం, మే 18 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రం వ్యవసాయ మార్కెట్ యార్డులోని షెడ్లు గోదాము దాదాపుగా మార్క్ఫెడ్ సంస్థ ద్వారా కొనుగోలు చేసిన మక్కలతో నిండిపోయాయి. ఇప్పటివరకు కేసముద్రం, ఇనుగుర్తి మండలాల పరిధిలోని దనసరి, కేసముద్రం సొసైటీ పరిధిలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాల నుండి 3,737 మంది రైతులకు చెందిన 3,73,470 బస్తాల మక్కలను కొనుగోలు చేసి ఏ సంవత్సరం మార్కెట్ యార్డులోని రెండు షెడ్లు, ఒక గోదాములో నిలువ చేశామని, ఇంకా రైతుల నుండి దాదాపు లక్షకు పైగా బస్తాల మక్కలను కొనుగోలు చేసే అవకాశం ఉందని కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి తెలిపారు.

ఇప్పటివరకు రైతుల నుండి 44,81,64,000 రూపాయల విలువైన మక్కలను కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఇందులో మార్చి 27 నుండి ఏప్రిల్ వరకు కేసముద్రం మార్కెట్ యార్డ్ లో కొనుగోలు చేసిన 1,53,208 బస్తాల మక్కలను పెద్దపల్లి, హుస్నాబాద్ గోదాములకు తరలించామని చెప్పారు. అక్కడ నిలువ సామర్థ్యం లేకపోవడంతో పాటు వాతావరణంలో ఏర్పడ్డ మార్పులతో చివరకు కేసముద్రం మార్కెట్ యార్డులోనే మక్కలను నిల్వ చేయాలని, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏప్రిల్ 27 నుండి ఇక్కడే నిల్వ చేస్తున్నామని చెప్పారు.

రైతుల ఇబ్బందులను పరిష్కరించడానికి, మొక్కల కొనుగోలను వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా బీహార్ కార్మికులను రంగంలోకి దింపినట్టు చెప్పారు. ఇంకా తాళ్ల పూస పల్లి, ఇనుగుర్తి కొనుగోలు కేంద్రాల నుండి మరో 80 నుండి 1,20,000 బస్తాల వరకు మక్కలను సేకరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో మాట్లాడుతూ, శాంతి భద్రతలకు ఇబ్బందులు కలగకుండా పోలీసుల సహకారంతో మక్కల కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు.

రైతులు సంయమనం పాటించి అధికారులతో సహకరిం చాలని, మరో వారం రోజుల్లో మక్కల కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ ఐ క్రాంతి కిరణ్, మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు, వ్యవసాయ అధికారి వెంకన్న, సొసైటీల సీఈవోలు మల్లారెడ్డి, ఎల్లయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.